
డబుల్ డమ్మీ కొమోరి మల్టీకలర్
జపాన్ తయారీ ప్రింటింగ్ మెషీన్
●
● చేరువలోనే ప్రింటింగ్ క్లస్టర్
● టైర్–2 సిటీల్లో ఇక్కడే తొలిసారి
● జపాన్ టెక్నాలజీ, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు
● రూ.15 కోట్ల పెట్టుబడి
● ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అంతర్జాతీయ ప్రమాణాలతో.. కళ్లు మిరుమిట్లు గొలిపే మల్టీకలర్ ప్రింటింగ్ మనకూ అందుబాటులోకి వచ్చేస్తోంది. ఎక్కడో దూరంగా ఉన్న విజయవాడలో కానీ అందుబాటులో లేని అత్యంత ఆధునిక టెక్నాలజీ ఇకపై మన దరి చేరబోతోంది. రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటు, చొరవతో కాకినాడలోనే ప్రింటింగ్ క్లస్టర్ అందుబాటులోకి వచ్చేస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చేయూతనిచ్చేలా ఈ క్లస్టర్ సిద్ధమవుతోంది. టైర్–2 (రెండో శ్రేణి) నగరాల్లో రాష్ట్ర ప్రభుత్వం చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. వీటి ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే సంకల్పంతో పారిశ్రామిక క్లస్టర్లు తీసుకు వస్తోంది. దీనిలో భాగంగా కాకినాడలో ఇప్పటికే ప్రింటింగ్ క్లస్టర్ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ట్రయల్ రన్ జరుగుతోంది. మరోవైపు కాకినాడలోనే రైస్ క్లస్టర్, పాలిమర్ క్లస్టర్ కూడా సిద్ధమవుతున్నాయి. రాజమహేంద్రవరంలో ఫర్నిచర్ క్లస్టర్, మాచవరంలో డాల్ క్లస్టర్ల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్థాయిల్లోనూ తోడ్పాటు అందిస్తోంది.
క్లస్టర్లతో ఉపాధికి ఊతం
క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఉమ్మడి సదుపాయాల కేంద్రాలను (కామన్ ఫెసిలిటీ సెంటర్లు) ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోంది. ఒకేచోట అన్ని రకాల సేవలూ అందుబాటులో ఉంచడం ద్వారా ఒక్కో పనికి ఒక్కో ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలనేది ప్రభుత్వ సంకల్పం. ఇందుకు అనుగుణంగానే క్లస్టర్లు ఏర్పాటు చేస్తోంది. ఈ క్లస్టర్ల ఏర్పాటుకు రెండు రకాల రాయితీలు అందిస్తోంది. మొదటి కేటగిరీలో 10 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు, రెండో కేటగిరీలో 20 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి కేటగిరీ రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు, రెండో కేటగిరీ క్లస్టర్‌ను రూ.10 కోట్ల నుంచి రూ.30 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం దాదాపు నిర్మాణం పూర్తయిన కాకినాడ ప్రింటింగ్ క్లస్టర్ రెండో కేటగిరీలో సుమారు రూ.15 కోట్లతో ఏర్పాటైంది. దీనిలో కేంద్రం 70 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం చొప్పున రాయితీ సమకూరుస్తున్నాయి. ఈ క్లస్టర్‌లో ఒకేసారి 200 మంది ప్రింటర్లకు సరిపడా సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇంతటి భారీ స్థాయిలో ప్రింటింగ్ క్లస్టర్ రావడం జిల్లా పారిశ్రామిక చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని పలువురు అంటున్నారు.
తప్పనున్న దూరాభారం
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురంతో పాటు మండపేట, రామచంద్రపురం తదితర పట్టణాల్లో సుమారు 500 ప్రింటింగ్ యూనిట్లు ఉన్నాయి. అయినప్పటికీ వేల సంఖ్యలో మల్టీకలర్ డిజైనింగ్, ప్రింటింగ్, బైండింగ్, కటింగ్ వంటి భారీ ఆర్డర్లు ఉంటే ఇప్పటి వరకూ ఇక్కడి వారు దూరాన ఉన్న విజయవాడ వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఈ ప్రాంతం వారు ఎన్నో వ్యయప్రయాసలు ఎదుర్కొంటున్నారు. కాకినాడలో ప్రింటింగ్ క్లస్టర్ అందుబాటులోకి వచ్చాక ఇక్కడి వారికి విజయవాడ వెళ్లే బాధ తప్పుతుంది. ప్రింటింగ్‌కు సంబంధించిన అన్ని రకాల సేవలూ కాకినాడలోనే లభించనున్నాయి. ఆ మేరకు వారికి వ్యయంతో పాటు సమయం కూడా కలిసి వస్తుంది.
అందుబాటులో అత్యాధునిక మెషీన్లు
● మల్టీకలర్ ప్రింటింగ్ ఈ క్లస్టర్ ప్రత్యేకత. జపాన్‌లో తయారైన ప్రింటింగ్, ఫోల్డింగ్, స్టేషనరీ, బైండింగ్, గమ్మింగ్, సీటీపీ, కటింగ్ తదితర 12 రకాల భారీ మెషీన్లు ఈ క్లస్టర్‌కు వచ్చేశాయి.
● జపాన్‌లో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జీఎల్–37 అనే మెషీన్ కూడా ఈ క్లస్టర్‌కు చేరుకుంది. ఈ మెషీన్‌తో ఏకకాలంలో డబుల్ డమ్మీలు రూపొందించవచ్చు. కాకినాడ క్లస్టర్‌లో తప్ప రాష్ట్రంలో మరెక్కడా ప్రస్తుతం ఈ మెషీన్ అందుబాటులో లేకపోవడం విశేషం.
● వెబ్ మెషీన్లు కూడా ఈ క్లస్టర్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఒకేసారి లక్ష ఏ4 బ్లాక్ అండ్ వైట్ కాపీలు తీయడం ఈ వెబ్ మెషీన్ ప్రత్యేకత. 4 వేల ఏ4 షీట్లతో ప్లేట్ ప్రింటింగ్‌కు విజయవాడలో రూ.2 వేల నుంచి రూ.2,500 వరకూ వ్యయం అవుతూంటే అదే కాకినాడ క్లస్టర్‌లో రూ.1600 మాత్రమే అవుతుంది.
వ్యయప్రయాసలు తప్పుతాయి
రాష్ట్రంలో మరెక్కడా లేని సాంకేతిక పరిజ్ఞానంతో మల్టీకలర్ ప్రింటింగ్ ఇక్కడ అందుబాటులోకి రావడం చాలా గొప్ప విషయం. ఎన్నో వ్యయప్రయాసలు ఎదుర్కొని విజయవాడ వెళ్లాల్సిన అవసరం కాకినాడ ప్రింటింగ్ క్లస్టర్ ఏర్పాటుతో తప్పుతుంది. విజయవాడ వెళ్తే ఒక రోజు వృథాగా పోయేది. దాదాపు అన్ని మెషీన్లూ వచ్చేశాయి. ఒకే ఒక్క మెషీన్ జపాన్ నుంచి రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం రెండో విడత నిధులు విడుదల చేస్తుందని ఎదురు చూస్తున్నాం. ఈ క్లస్టర్‌లో కామన్ ఫెసిలిటీ సెంటర్‌తో ఉత్తమమైన సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తొలి నుంచీ ఎంతో ప్రోత్సహించి, రాయితీ కూడా మొదట్లోనే విడుదల చేసింది. – బాలప్రసాద్, ఎండీ, సత్యదేవ ప్రింటింగ్ క్లస్టర్, కాకినాడ
భవిష్యత్ అంతా పారిశ్రామిక క్లస్టర్లదే..
భవిష్యత్ అంతా క్లస్టర్లదే. చిన్నచిన్న పారిశ్రామికవేత్తలు ఒకేచోట కామన్ ఫెసిలిటీ సెంటర్ల ద్వారా సేవలందుకోవచ్చు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్థాయిల్లోనూ తొలి నుంచీ ప్రోత్సాహాన్ని అందించడంతో ప్రింటింగ్ క్లస్టర్ దాదాపు సిద్ధమైంది.
– టి.మురళి, జనరల్ మేనేజర్,
జిల్లా పరిశ్రమల కేంద్రం

4హై వెబ్ డబుల్ రీల్‌స్టాండ్ క్వార్టర్ పేజీ ఫోల్టర్ మెషీన్

