నీళ్లడిగితే కేసులా..! | - | Sakshi
Sakshi News home page

నీళ్లడిగితే కేసులా..!

Oct 9 2026 12:38 AM | Updated on Oct 9 2026 12:38 AM

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఆరుగాలం కష్టపడి సాగుచేసిన పంట కళ్ల ముందే ఎండిపోతుంటే ఏ రైతు చూస్తూ ఊరుకోగలడు.. నాటిన పైరుకు నీరందించి బతికించుకునేందుకు నానా తంటాలు పడుతాడు. ఇదే కోవలో సాగునీటి కోసం అలమటిస్తున్న జూరాల ఎడమ కాల్వ ఆయకట్టు రైతులు చేసిన పని నేరమైంది. ఎల్‌నినో, వర్షాభావంతో ఎండిపోతున్న తమ పంటలను కాపాడుకునేందుకు ఆందోళనకు దిగిన ఆ అన్నదాతలు స్వయంగా నీటిని విడుదల చేసుకోగా.. వారిపై పోలీసులు నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. పోలీసుల చర్యలతో వనపర్తి జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్‌ మండలాల్లో ఉద్విగ్న పరిస్థితులు నెలకొనగా.. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా కలకలం రేగింది. సాగు నీరివ్వమని అడిగితే కేసులు పెడతారా అంటూ సదరు రైతులు ప్రశ్నిస్తుండగా.. ప్రభుత్వ తీరుపై రైతు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి.

అసలేం జరిగిందంటే..

ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్‌ పరిధిలో కుడి, ఎడమ కాల్వల కింద జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో రైతులు ఈ వానాకాలం సీజన్‌లో సుమారు 1.15 లక్షల ఎకరాల వరకు సాగు చేశారు. అయితే వర్షాభావ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆరుతడి పంటలకే సాగు నీరందిస్తామని చెప్పినప్పటికీ.. లక్ష ఎకరాలకు పైగా వరి సాగైంది. ప్రస్తుతం పొట్ట దశ లో ఉన్న పంటకు నీటి తడులు అవసరం కాగా.. భ విష్యత్‌లో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయ నే ఉద్దేశంతో ఎడమ కాల్వకు నీరివ్వలేమని అధికా రులు ప్రకటించారు. ఈ ఆయకట్టులో వనపర్తి జిల్లా లోని ఆత్మకూరు, అమరచింత, మదనాపురం, పెబ్బేరు, కొత్తకోట, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లో మొత్తం 85వేల ఎకరాలు ఉండగా.. అధికారుల ప్రకటనతో రైతులు బెంబేలెత్తారు.

16న ఆందోళనలు.. 19న ఉధృతం

ఎడమ కాల్వకు సాగు నీళ్లు ఇవ్వలేమని అధికారుల ప్రకటన క్రమంలో గత నెల 16న ప్రాజెక్ట్‌ సమీపంలోని ఆత్మకూరు, అమరచింత మండలాలకు చెందిన రైతులు ఆందోళన బాటపట్టారు. 17, 18 తేదీ ల్లో సైతం నిరసనలు తెలిపినా.. ప్రజాప్రతినిధులు గాని, అధికారులు గాని పట్టించుకోలేదు. ఈ క్ర మంలో 19న ఎడమ కాల్వ హెడ్‌ రెగ్యులేటరీ వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు సీపీఎం నాయకులు, శ్రేణులు మద్దతు తెలిపాయి. జూరాల ప్రాజెక్ట్‌ ముఖద్వారం వద్ద బీజేపీ సైతం రైతులకు సంఘీభావంగా ఆందోళనకు దిగింది. దీంతో అక్కడికి చేరుకున్న పీజేపీ అధికారులు నీరు విడుదల చేయలేమని చెప్పడంతో ఆగ్రహించిన రైతులు వారితో వాగ్వాదానికి దిగడంతోపాటు స్వయంగా ఎడమ కాల్వ పరిధిలో రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకోవడం.. తెరిచిన గేట్లు బంద్‌ చేయడం తెలిసిందే. ఆ తర్వాత రోజు బీఆర్‌ఎస్‌ ఆందోళనలకు పిలుపునివ్వగా పలువురు నేతలను గృహనిర్బంధం చేశారు.

రైతు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాల భగ్గు

రైతులపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేయడంపై వివిధ రైతు, ప్రజా సంఘాలు, వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. అన్నదాతలను నేరస్థుల్లా చూడడం దారుణమని, పంటలకు నీరివ్వడం చేతకాకపోగా.. రైతులపై కేసులు బనాయించడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులపై పెట్టిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని.. అలాగే చివరి ఆయకట్టు వరకూ ఎండిపోతున్న పంటలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేనిపక్షంలో జూరాల ఆయకట్టుతోపాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

జూరాల ఆయకట్టు రైతుల ఆక్రందన

ఎడమ కాల్వకు నీరు విడుదల చేసిన రైతులపై నాన్‌బెయిలబుల్‌ కేసులు

కలకలం రేపుతున్న పోలీసుల చర్యలు

అమరచింత, ఆత్మకూర్‌ మండలాల్లో ఉద్విగ్న పరిస్థితులు

భగ్గుమంటున్న ప్రజా, రైతు సంఘాలు,ప్రతిపక్ష పార్టీల నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement