గ్రామీణ కూలీలకు ‘ఉపాధి’ కల్పించండి | - | Sakshi
Sakshi News home page

గ్రామీణ కూలీలకు ‘ఉపాధి’ కల్పించండి

Oct 9 2026 12:38 AM | Updated on Oct 9 2026 12:38 AM

అలంపూర్‌: వర్షాభావ పరిస్థితుల్లో కూలీలకు పనులు లేక వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని.. అన్ని గ్రామాల్లో వీబీ–జీ రామ్‌జీ పథకం ద్వారా ఉపాధి కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకురాలు పద్మ డిమాండ్‌ చేశారు. అలంపూర్‌లోని కేవీపీఎస్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఆ సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కరువుఛాయలు కమ్మేస్తున్నాయన్నారు. మరోవైపు నిత్యావసర ధరలు పెరిగి, ప్రజలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా పనులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాలతో పాటు మున్సిపాలిటీల్లో ఏడాదికి 200 రోజుల పనిదినాలు కల్పించి.. రోజుకు రూ. 800 కూలి చెల్లించాలని కోరారు. కరువు పరిస్థితుల్లో రేషన్‌ దుకాణాల్లో 14 రకాల నిత్యావసర సరుకులను ఉచితంగా అందించాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఉపాధి కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు చెల్లించాలన్నారు. చేయూత పింఛన్‌ పెంచాలని.. అర్హత ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహ, కార్యదర్శి రాజు, నాయకులు జయన్న, సిద్దయ్య, బుడ్డన్న, నాగన్న, కురుమన్న ఉన్నారు.

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి

గద్వాల న్యూటౌన్‌: ఫామ్‌–6లో మార్పులు చేయడం ద్వారా చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేష్‌కుమార్‌ చాలా తప్పులకు కారణమయ్యాడని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం స్థానిక కృష్ణవేణి చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకుడు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, జేఏసీ నాయకుడు మధుసూదన్‌బాబు, టీజేఎస్‌ కన్వీనర్‌ ఆలూరు ప్రకాష్‌గౌడ్‌ మాట్లాడుతూ.. మిగిలిన ఇద్దరు కమీషన్‌ సభ్యుల అభిప్రాయాలు తీసుకోకుండా జ్ఞానేష్‌కుమార్‌ ఏకపక్షంగా వ్యవహరించాడని విమర్శించారు. దేశంలో 13 కోట్ల ఓట్లను తొలగించడానికి కారణమయ్యాడన్నారు. ఫామ్‌–7 ద్వారా ఎంతోమంది ఓటర్లను బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు తొలగించారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ మీద నమ్మకం ఉండాలంటే ఆయన వెంటనే రాజీనామా చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వాల్మీకి, వినోద్‌కుమార్‌, పల్లయ్య, ఆంజనేయులు, నరసింహ, వంకర ప్రభాకర్‌, సుభాన్‌, వెంకన్న, దానయ్య, రహ్మతుల్లా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement