● గద్వాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్‌పై ఆగ్రహం
● సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
గద్వాల: జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి బాగోతంపై కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సీరియస్ అయ్యారు. శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘కాసులిస్తేనే పనులు’ కథనంపై ఆయన స్పందిస్తూ.. నిషేధిత జాబితాలో ఉన్న సర్వేనంబర్ల భూములకు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై సమగ్ర వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. సదరు అవినీతి అధికారి నిషేధిత సర్వేనంబర్‌లోని 1024లో మరో ప్లాట్‌కు రిజిస్ట్రేషన్ చేసినట్లు వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి సుమారు రూ. 50వేలు వసూళ్లు చేసినట్లు తెలిసింది.
తొలిసారిగా ముందుగానే ఆఫీసుకు..
గద్వాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చోటు చేసుకుంటున్న అక్రమాలపై ‘సాక్షి’ ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకురావడంతో సదరు అధికారితో పాటు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, స్టాంప్ వెండర్లు ఉలిక్కిపాటుకు గురయ్యారు. సబ్ రిజిస్ట్రార్ రోజు 11గంటల తర్వాత దర్జాగా వచ్చేవారు. అయితే ‘సాక్షి’లో కథనం రావడంతో గతానికి భిన్నంగా సదరు అధికారి ఉదయమే విధులకు హాజరు కావడంతో అక్కడున్న సిబ్బంది ఆశ్చర్యపోయ్యారు. గద్వాలకు బదిలీపై వచ్చిన రెండున్నరేళ్ల కాలంలో ఎన్నడూ లేనిది తొలిసారి ఆఫీసుకు ముందుగా రావడం ఏమిటని అవాక్కయ్యారు.
సమాచారం ఎవరిచ్చారు..
కార్యాలయంలో గోప్యంగా జరిగే అవినీతి బాగోతం బయటకు ఎలా పొక్కింది.. ఇంతకు ‘సాక్షి’కి ఎలా ఆధారాలు లభించాయి.. సమాచారం ఇచ్చిన వారెవరు అంటూ సదరు అవినీతి అధికారి విచారించారు. స్టాంప్ రాసిన స్టాంప్‌వెండర్, రిజిస్ట్రార్ చేయించుకున్న వారితో పాటు లంచాలు వసూలుచేసే మధ్యవర్తులను తన చాంబర్‌లోకి పిలిపించుకుని ఒక్కొక్కరిని విచారణ జరిపినట్లు సమాచారం. సమాచారం ఎవరిచ్చారో తెలుసుకోవాలంటూ మధ్యవర్తులను పురమాయించినట్లు తెలిసింది.
సదరు అధికారికి గిరాకీ ఎక్కువ..
అవినీతికి పాల్పడుతున్న సదరు అధికారి రోజుకు రూ. 50వేల నుంచి రూ.లక్ష వరకు వసూళ్లు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరాసరి స్లాట్ల బుకింగ్ ప్రకారం రోజుకు 96 రిజిస్ట్రేషన్లు అవుతాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్‌రిజిస్ట్రార్–1, సబ్‌రిజిస్ట్రార్–2 అధికారులు ఉన్నారు. బుక్ అయిన స్లాట్లలో ఇద్దరు కూడా సగం, సగం చేయాల్సి ఉంటుంది. కాని ఇందులో ప్రధాన అధికారికే గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఇందుకు కారణం ఆ అధికారి ఎలాంటి లింకు డాక్యుమెంట్లు లేకున్నా.. నిషేధిత భూములైనా, అగ్రికల్చర్ భూములైనా, ఓఆర్సీలు లేకున్నా పని ఇట్టే చేసేస్తారనే పేరుంది. దీంతో ఆ అధికారి వద్దే ఎక్కువ రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ఎగబడిపోతారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమాలకు పాల్పడే అధికారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
’సాక్షి’లో ప్రచురితమైన కథనం


