● జేబులు నింపుకొనేందుకే
రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు
● మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
గట్టు: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచాయని.. మూడేళ్లలో చేయలేని పనులను మిగిలిన రెండేళ్లలో ఎలా చేస్తారని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. గురువారం గట్టులో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదని.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయన్నారు. జేబులు నింపుకొనేందుకు రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. మూడేళ్లు కాలయాపన చేసి, ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. జూరాలకు నీటి విడుదలపై రాత్రికి రాత్రి తెలంగాణ మంత్రులు కర్ణాటకకు వెళ్లి డ్రామా చేశారని ఆరోపించారు. వర్షాలతో వచ్చిన నీటిని కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసినట్లు అబద్దపు ప్రచారం చేసిన ఘనత వారికే దక్కుతుందన్నారు. సాగునీటి కోసం ఆందోళన చేసిన రైతులపై కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం ఎలా అవుతుందని ప్రశ్నించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. మున్సిపాలిటీల్లో ఆస్తిపన్నులను రూ. కోట్లలో వసూలు చేసి.. లెక్కలు మాత్రం రూ. లక్షల్లో చూపుతున్నారని ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే గద్వాలను నాలుగు రోజుల్లో అమ్మేస్తారన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, నాయకులు డీకే స్నిగ్థారెడ్డి, రామచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు, రవికుమార్ ఎక్బోటే, అక్కల రమాదేవి, మధుసూదన్‌రావు, బల్గెర శివారెడ్డి, బాబుల్‌రెడ్డి, దాస్, సురేశ్, శాలన్న, చంద్రశేఖర్ ఉన్నారు.


