మానవపాడు: జిల్లావ్యాప్తంగా ప్రజల ఆరోగ్యం గాలిలో దీపంలా మారింది. హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్, పాస్ట్‌ఫుడ్ సెంటర్లు, మిఠాయి దుకాణాలు.. నాణ్యతా ప్రమాణాలను తుంగలో తొక్కి.. అపరిశుభ్రతకు నిలయంగా.. రోగాల పుట్టలుగా మారాయి. ఫుడ్ సేఫ్టీ యంత్రాంగం మాత్రం నామమాత్రపు తనిఖీలతో మమ అనిపిస్తూ మామూళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లాలోని గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా పరిస్థితి దారుణంగా ఉంది. చాలా హోటళ్లలోని వంట గదులకు వెళ్తే వాంతులు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. గోడల నిండా నూనె మరకలు, జిడ్డు, కింద పేరుకుపోయిన చెత్త, పాచిపట్టిన వంటపాత్రలు, వంట గదుల్లో బొద్దింకలు, బల్లులు, ఎలుకలు యథేచ్ఛగా తిరగాడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. వంట మనుషులకు హెడ్ క్యాప్‌లు, గ్లౌజులు, అప్రాన్లు లేకుండా.. అపరిశుభ్రమైన చేతులతో వంటకాలు తయారు చేస్తున్నారు.
వాడిన నూనెతో వంటకాలు..
అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే.. ఒకసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ కాగబెట్టి అదే నూనెతో పూరీలు, బజ్జీలు, సమోసాలు, చికెన్ ఫ్రై చేస్తున్నారు. నల్లగా, విషతుల్యంగా మారిన ఆ నూనె తింటే క్యాన్సర్, గుండె జబ్బులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక రెస్టారెంట్లు, దాబాలలో రోజుల తరబడి నిల్వ ఉంచిన చికెన్, ఇతర పదార్థాలనే ప్రజలకు వడ్డిస్తున్నారు.
అంతకు మించి..
జిల్లాలోని మిఠాయి దుకాణాల్లో దోపిడి అంతకు మించి అన్న చందంగా మారింది. పండుగల పేరుతో నెలరోజుల క్రితం తయారు చేసిన కాలం చెల్లిన స్వీట్లకు నానా రకాల రంగులు అద్ది తాజా స్వీట్లుగా అమ్ముతున్నారు. ఈ స్వీట్లు తిన్న చిన్నపిల్లలు, వృద్ధులు వాంతులు, విరేచనాలు చేసుకొని ఫుడ్ పాయిజన్ బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. మరోవైపు ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నా.. అధికారులు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని ప్రజలు వాపోతున్నారు. జిల్లాలో ఉన్న అధికారులు మాత్రం ఏడాదిలో రెండు, మూడు సార్లు మాత్రమే కంటి తుడుపు చర్యగా తనిఖీలు చేసి.. ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోతున్నారు. ఫిర్యాదు వచ్చి పేపర్లో రచ్చ అయితే తప్ప తనిఖీలు చేయడం లేదు. అప్పుడు కూడా నామమాత్రపు జరిమానాలతో సరిపెడుతున్నారే తప్ప లైసెన్స్‌లు రద్దు చేయడం లేదు. దీని వెనుక అసలు ఆంతర్యం ఏమిటో ఫుడ్ సేఫ్టీ అధికారులకే తెలియాలి.
టాస్క్‌ఫోర్స్‌తో దాడులు చేయాలి..
ఫుడ్ సేఫ్టీ అధికారులు కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా లెసెన్స్‌లు రద్దు చేయాలి. ప్రత్యేక టస్క్‌ఫోర్స్ వేసి ప్రతి దాబా, హోటళ్లు, మిఠాయి దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి. ఫ్రిజ్‌లు, కిచెన్‌లలో తనిఖీలు చేసి నాణ్యతతో కూడిన ఆహారం అందించేలా, ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. – రామకృష్ణ, గద్వాల
తనిఖీలు చేస్తున్నాం..
హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలలో నాణ్యత లేని ఆహారం ప్రజలకు అందిస్తే కఠిన చర్యలు తప్పవు. తప్పకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు విస్తృతంగా తనిఖీ చేపడుతాం. జిల్లాలో ఎక్కువ రోజులుగా వాడిన నూనె మళ్లీ వినియోగిస్తున్నారని సమాచారం ఉంది. తనిఖీలు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– కరుణాకర్, ఫుడ్ సేఫ్టీ అధికారి జోగుళాంబ గద్వాల జిల్లా
జిల్లాలో అపరిశుభ్రతకు నిలయంగా మారిన హోటళ్లు
రోగాలబారిన పడుతున్న ప్రజానీకం
నామమాత్రపు తనిఖీలతో
సరిపెడుతున్న అధికారులు


