పట్టభద్రులను సమన్వయం చేద్దాం | - | Sakshi
Sakshi News home page

పట్టభద్రులను సమన్వయం చేద్దాం

Oct 4 2026 10:01 AM | Updated on Oct 4 2026 10:01 AM

గద్వాల: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులను సమన్వయం చేద్దామని శాట్స్‌ మాజీ చైర్మన్‌ ఆంజనేయగౌడ్‌ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి నేటికీ అమలు చేయకుండా కాలయాపన చేస్తూ నిరుద్యోగులను మభ్యపెడుతుందని విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి మరో 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చి నియామక ప్రక్రియ చేపట్టారని గుర్తుచేశారు. కానీ, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు మూడేళ్లలో 12 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిందని ఆరోపించారు. గత ఏపీ ప్రభుత్వం రూ.15 వేల కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్‌ బకాయిలు పెట్టి వెళ్లగా కేసీఆర్‌ ఎలాంటి కారణాలు చెప్పకుండా వాటిని చెల్లించారన్నారు. స్వరాష్ట్రంలో పదేళ్లలో ఇప్పటి వరకు రూ.19 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు రూ.13వేల కోట్ల బకాయి లు చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. ప్రతి గ్రామంలో పార్టీ కార్యకర్తలు పట్టభద్రుల ఎన్‌రోల్‌మెంట్‌ చేపట్టాలని బాధ్యతగా అందరిని కలుపుకొని పోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు బాసు హన్మంతు, బీఎస్‌ కేశవ్‌, వెంకట్రాములు, శ్యామల, పద్మ, రాఘవేందర్‌రెడ్డి, వెంకటేష్‌, దుబ్బన్న, మోహన్‌, తిమ్మప్ప, పల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement