గద్వాలన్యూటౌన్/అయిజ: తెలంగాణ విమోచన (సాయుధ) పోరాటంలో నడిగడ్డ ప్రాంతం విశిష్టమైన పాత్ర పోషించింది. తుంగభద్ర, కృష్ణానదుల మధ్య విస్తరించి ఉన్న భౌగోళిక ప్రాధాన్యత కారణంగా ఈ ప్రాంతం నిరంకుశ పాలనకు, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో వ్యూహాత్మక కేంద్రంగా నిలిచింది. నాటి ఎన్నో వీరోచిత పోరాటాలు.. సంఘటిత కార్యక్రమాలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. గద్వాల మహారాణి ఆది లక్ష్మీదేవమ్మ పోలీసు చర్యలకు అనుకూలంగా రాసిన లేఖతో విమోచనానికి మొదటి అడుగు పడటమే కాకుండా.. భారత ప్రభుత్వంలో తెలంగాణ విలీనానికి మార్గం సుగమమైంది.
ప్రజల్లో స్ఫూర్తి నింపి..
నడిగడ్డలో జరిగిన ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు ప్రజల్లో స్ఫూర్తిని నింపాయి. 1927లో తేరుమైదానంలో జరిగిన జాతీయ జెండావిష్కరణ, 1947లో అయిజలో జరిగిన లెవీ సహాయ నిరాకరణ ఉద్యమం, కర్నూలు నుంచి నైజాం రైలు వస్తున్న సమయంలో ఇటిక్యాల రైల్వేస్టేషన్ కాల్చడం, మానవపాడు స్టేషన్ వరకు ఉన్న పట్టాలు తొలగించడం, రైల్వే టెలిఫోన్ వైరింగ్ కత్తిరించడం వంటి ఘటనలను ఉద్యమంలో ముఖ్యమైనవిగా చెప్పవచ్చు.
మహారాణి సాహసోపేత నిర్ణయం..
దేశానికి 1947లో స్వాంతంత్య్రం సిద్ధించినా నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానంతో పాటు తెలంగాణలోని మరికొన్ని సంస్థానాలు భారత యూనియన్‌లో విలీనం కాలేదు. అప్పటి నిజాం నవాబు భారత యూనియన్ విలీనానికి సుముఖంగా లేకపోగా.. పాకిస్థాన్‌లో చేరేందుకు అనుకూలమైన చర్యలు చేపట్టాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న అప్పటి యూనియన్ హోంశాఖ మంత్రి సర్ధార్ వల్లబాయ్ పటేల్ సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేసేందుకు ప్రత్యేక సైన్యంతో కర్నూలు తుంగభద్ర నదీ తీరాన మోహరించారు. నిజాం నిరంకుశత్వాన్ని వ్యతిరేకించి, స్వతంత్ర సంస్థానంగా కొనసాగుతున్న గద్వాల సంస్థాన మహారాణి ఆది లక్ష్మీదేవమ్మ విషయం తెలిసింది. గద్వాల సంస్థానంలోని కృష్ణానది తీరానికి సైన్యానికి పంపాలని పటేల్‌కు మహారాణి లేఖ రాసింది. ఆ లేఖతో తెలంగాణ విమోచనానికి తొలి అడుగు పడింది. అనంతరం 1948 సెప్టెంబర్ 17న అనేక సంస్థానాలతో పాటు గద్వాల సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైంది.
ఏడుగురి ప్రాణత్యాగం..
నిజాం నవాబుల దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఎందరో యోధులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టారు. 1947 డిసెంబర్ 12న పోలీసులు జరిపిన కాల్పుల్లో అయిజకు చెందిన రైతులు నాయకి చిన్న తిమ్మప్ప, కల్లె బీచుగాడు, కొండాపురం నర్స ప్ప, పాగుంట వెంకటయ్య, బలిజ నాగయ్య ప్రాణాలను కోల్పోయారు. అయినప్పటికీ అయిజ రైతులు పోరాటాన్ని ఆపలేదు. నాటి అమరవీరులకు గుర్తుగా 1955లో స్థూపాన్ని నిర్మించారు. అదే స్థూపాన్ని 1999లో ఆధునికీకరించి, గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వీరోచిత పోరు
ఉమ్మడి జిల్లాలోనే మొట్టమొదటగా లేవీ పన్ను వ్యతిరేకిస్తూ ఉద్యమం
పోలీసు చర్యలకు అనుకూలంగా గద్వాల మహారాణి లేఖ
సంఘటితం చేసిన మరెన్నో పోరాటాలు


