గణేశ్‌ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

గణేశ్‌ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

Sep 17 2026 1:14 AM | Updated on Sep 17 2026 1:14 AM

గద్వాల/ఎర్రవల్లి: గణేశ్‌ విగ్రహాల నిమజ్జనాన్ని ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి జిల్లాకేంద్రం సమీపంలోని నదీ అగ్రహారం, బీచుపల్లి క్షేత్రంలోని పుష్కరఘాట్లను పరిశీలించారు. నిమజ్జనం చేసే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా బారీకేడ్స్‌ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గజ ఈతగాళ్లు, వైద్య, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. వారి వెంట ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ జానకీరామ్‌ ఉన్నారు.

పకడ్బందీగా ధాన్యం సేకరణ..

వానాకాలంలో పండించిన వరిధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ధాన్యం దిగుబడిని దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అక్టోబర్‌ 1 నుంచే కొనుగోళ్లకు ఏర్పాటుచేసి, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ధాన్యం అక్రమ రవాణాను అడ్డుకట్ట వేసేందుకు సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌, డీఎస్‌వో స్వామికుమార్‌, డీఎం విమల, డీఏవో వీరప్ప, డీసీఎస్‌వో శ్రీనివాస్‌, ఎల్‌డీఎం శ్రీనివాసరావు ఉన్నారు.

● బాల్యవివాహాల నిర్మూలనకు రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని కలెక్టర్‌ అన్నారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో కలిసి పోస్టర్‌ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నవంబర్‌ 27న అంతర్జాతీయ బాల్యవివాహాల నిర్మూలన దినోత్సవంగా పాటించాలని ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం బాల్యవివాహాలపై నిఘా ఉంచి, కట్టడి చేస్తున్నట్లు చెప్పారు. బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కలిగించేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ సునంద, ఆర్డీఎస్‌ అధ్యక్షురాలు చిన్నమ్మ, కోఆర్డినేటర్‌ ఎడ్విన్‌, చంద్రశేఖర్‌, ధనలక్ష్మి, సాత్విక్‌, విద్యుల్లత పాల్గొన్నారు.

దళారులను నమ్మొద్దు..

2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కోసం ఎలాంటి నిధుల కేటాయింపులు లేవని.. దళారులను నమ్మి మోసపోవద్దని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ తెలిపారు. దివ్యాంగుల సంక్షేమ పథకాలు, ఉపకరణాలు లేదా ఇతర ప్రభుత్వ పథకాలపై సమాచారం కోసం https.tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌ లేదా జిల్లా సంక్షేమ అధికారిని సంప్రదించాలని ఆయన సూచించారు. ఎవరైనా డబ్బులు డిమాండ్‌ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement