గద్వాల: ఆధార్ కేంద్రాల్లో వినియోగదారుల నుంచి ఎవరైనా అదనపు వసూళ్లు చేస్తే చర్యలు తప్పవని ఈడీఏ శివ హెచ్చరించారు. ఆధార్ కేంద్రాల్లో అదనపు రుసుంల వసూలు ఆరోపణల నేపథ్యంలో శనివారం ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ శివ జిల్లా కేంద్రంలోని 5 ఆధార్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రాలకు వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడి, నిర్ణీత రుసుం కంటే అదనంగా ఎవరైనా డబ్బులు వసూలు చేస్తున్నారా అనే విషయాన్ని ఆరా తీశారు. తనిఖీ సమయంలో ఎవరూ అదనపు మొత్తాన్ని చెల్లించినట్లు ఫిర్యాదు చేయలేదని, సెంటర్‌లో అందుతున్న సేవలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు ఎవరూ మధ్యవర్తులను నమ్మకుండా నేరుగా ఆధార్ కేంద్రాలను సందర్శించి సేవలు పొందాలని సూచించారు. నిర్వాహకులు నిర్ణీత రుసుం కంటే అధికంగా డబ్బులు వసూలు చేసినట్లయితే వెంటనే 1947కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎం సుధాకర్, ఆధార్ కేంద్రం నిర్వాహకులు తదితరులు ఉన్నారు.


