పకడ్బందీగా ‘సర్‌’.. | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ‘సర్‌’..

Sep 3 2026 4:09 AM | Updated on Sep 3 2026 4:09 AM

సరైన గుర్తింపు కార్డుతో ఓటుహక్కు పొందాలి

జిల్లా ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందించేలా చర్యలు

అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేస్తాం

ఈ నెల నుంచే పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌

‘‘కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్‌ ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా నిర్వహిస్తున్నాం.. ఓటరు జాబితాలో పేరు, ఇంటి అడ్రస్‌ పొరపాట్లకు సంబంధించి నోటీసులు జనరేట్‌ చేస్తున్నాం.. నిర్ణీత గడువులోగా సర్‌ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేస్తాం..’’ అని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అన్నారు. విద్య, వైద్యశాఖల్లో మెరుగైన ఫలితాల కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వివరించారు. ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేశామన్నారు. వానాకాలంలో సాగుచేసిన పంటలు దెబ్బతినకుండా అవసరమైన చర్యలు తీసుకునేలా సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. బుధవారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను సవివరంగా వివరించారు. ఆయన మాటల్లోనే.. – గద్వాల

జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఉన్న 594 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 5,03,859 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 87.31శాతం (4,39,934 మంది ఓటర్లు) డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన 63,925 మంది ఓటర్లు వివిధ రకాల కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయి. వీరికి నోటీసులు ఇచ్చి, సరైన ధ్రువపత్రాలు ఇస్తే ఓటుహక్కు కల్పిస్తాం. అదే విధంగా పేరులో పొరపాట్లు, ఇంటి అడ్రస్‌లో తప్పులు వంటి కారణాలతో 1,49,281మందికి నోటీసులు జారీ చేస్తున్నాం. వీరు ప్రభుత్వంచే గుర్తింపు పొందిన కార్డులు సమర్పిస్తే, ఓటు హక్కు కల్పిస్తాం.

మెరుగైన ఫలితాలకు చర్యలు..

పదో తరగతిలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం సెప్టెంబర్‌ నుంచే ప్రత్యేక తరగతులు ఏర్పాటుచేస్తాం. పోషణ్‌ యాప్‌లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన వివరాలను నమోదు చేయాల్సి ఉంది. ఇందులో రాష్ట్రంలో జిల్లా 26వ స్థానంలో ఉండేది. నేను వచ్చిన తర్వాత మార్పులు చేపట్టి.. 1వ స్థానంలో నిలిచాం. జిల్లావ్యాప్తంగా 340మంది టీచర్లు తక్కువగా ఉన్నారు. వీరి స్థానంలో 125మంది విద్యా వలంటీర్లను నియమించాం. గట్టు, కేటీదొడ్డి మండలాల్లోనే అత్యధికంగా 60మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా బడిమానేసిన 6వేల మందిని తిరిగి బడుల్లో చేర్పించాల్సి ఉంది. అదే విధంగా డిప్యూటేషన్లపై ఉన్నవారిని రద్దు చేసి, వారి స్థానాలకు పంపడం జరిగింది. రెసిడెన్షియల్‌, హైస్కూల్‌ విద్యార్థులకు త్వరలోనే హెల్త్‌కార్డులు ఇచ్చి.. కంటి, చెవి, రక్తహీనత, బాడీమాస్‌, చర్మ వ్యాధులకు అవసరమైన వైద్యం అందించేలా చర్యలు చేపడుతాం. ప్రభుత్వ పాఠశాలలను తహసీల్దార్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఎంపీడీవోలు పర్యవేక్షించేలా అదనపు బాధ్యతలు అప్పగించాం.

ఫిర్యాదులు పరిష్కరించేలా..

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు తప్పనిసరిగా పరిష్కారం చూపేలా నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నాం. నిర్లక్ష్యం వహించే అధికారులకు నోటీసులు ఇచ్చి, పనులు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. భూములకు సంబంధించి 22–ఏ కింద ఏదైనా సమస్య ఉంటే సరైన ఆధారాలతో పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నాం.

వేగవంతంగా భూసేకరణ ప్రక్రియ..

జిల్లాలో మల్లమ్మకుంట రిజర్వాయర్‌కు సంబంధించి ఇటీవల భూసేర్వే పూర్తయింది. త్వరలోనే మిగిలిన పనులను పూర్తిచేస్తాం. ప్రభుత్వపరంగా ఎకరాకు రూ.12లక్షల చొప్పున ఇస్తామన్నాం. అయితే రైతులు ఎక్కువ అడుగుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం.

పంటలు ఎండకుండా జాగ్రత్తలు..

వానాకాలంలో సాగుచేసిన పంటలు ఎండిపోకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం జూరాలలో 9టీఎంసీలు నీరు అందుబాటులో ఉంది. వాటిలో తాగునీటికి ఽమొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రధానంగా యాసంగిలో ఆరుతడి పంటలు సాగుచేసేలా చర్యలు తీసుకుంటాం.

పదిశాతం స్థలాలు కాపాడుతాం..

గద్వాల మున్సిపాలిటీ పరిధిలో పదిశాతం స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి, నివేదిక ఇవ్వాలని కమిషనర్‌ను ఆదేశించాం. అదే విధంగా భీంనగర్‌లో ఉన్న పదిశాతం స్థలంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను తొలగించి, సంరక్షణ చర్యలు చేపడుతాం.

అవగాహన అవసరం..

సర్‌ ప్రక్రియపై చాలా మందికి అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. బీఎల్‌వోలకు పలుమార్లు శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నాం. అనామాలీస్‌ అంటే పేర్లలో పొరపాట్లు ఉన్నవారు బీఎల్‌వో స్థాయిలోనే పరిష్కరించబడుతాయి. మ్యాపింగ్‌కు సంబంధించి కలెక్టర్‌ స్థాయిలో ఉంటుంది.

వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి..

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు చేపడుతున్నాం. రోగుల సౌకర్యార్థం అదనపు షెడ్లు ఏర్పాటు చేసేందుకు రూ. 50లక్షలు మంజూరు చేశాం. ఆస్పత్రిలో రేడియాలజీ వైద్యుడు అవసరం ఉంది. ఇందుకోసం పేపర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చాం. కానీ ఎవరు రాలేదు. ‘సాక్షి’ ద్వారా మరోసారి చెబుతున్నాం. అర్హత గల ౖరేడియాలజీ డాక్టర్‌ వస్తే నేరుగా అప్పాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ ఇస్తాం. లేదా ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న రేడియాలజీ డాక్టర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో 2–3గంటల పాటు పనిచేస్తే, వారికి తగిన ఫీజులు ఇచ్చేలా ఏర్పాటు చేస్తాం. ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement