గద్వాల క్రైం: సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘సైబర్ జాగ్రత్త దివాస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాల స్వరూపాలు కూడా మారుతున్నాయని అన్నారు. గుర్తుతెలియని నంబర్లు, ఆన్‌లైన్ చాటింగ్‌లు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనల లింక్‌లను డౌన్‌లోడ్ చేస్తుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. సైబర్ నేరగాళ్లు క్షణాల్లో వ్యక్తిగత గోప్యతను తస్కరించి.. బ్లాక్ మొయిల్‌తో ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు. వివిధ కారణాలతో సైబర్ మోసాలకు గురవుతున్నామని చెప్పడం కంటే.. వ్యక్తిగత విషయాలు చెప్పడం ద్వారా మోసానికి గురవుతున్నామనే విషయాన్ని గుర్తించలేకపోవడం జరుగుతుందన్నారు. పోలీసుశాఖ నిరంతరం చైతన్య కార్యక్రమాలతో అవగాహన కల్పిస్తున్నా.. వారిలో మార్పు లేకపోవడం మరో సమస్యగా ఉందన్నారు. పోలీసు సిబ్బంది చెప్పే స్వీయ జాగ్రత్తలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఎస్పీ సూచించారు. అనంతరం ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కల్పించే పోస్టర్‌ను ఆవిష్కరించారు.


