● రిటైర్డ్, బదిలీ అయిన అధికారులు సైతం హాజరు
గట్టు: గట్టు గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధుల వినియోగం వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారింది. గట్టు గ్రామస్తుల పేరుతో రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి ఇద్దరు అధికారులు నాగేశ్వర్‌రావు, నర్సింగరావు వచ్చి సర్పంచ్ నాగరాజు అధ్యక్షతన పంచాయతీ కార్యాలయంలో విచారణ నిర్వ హించారు. పంచాయతీ పాలకవర్గంతోపాటు గతంలో ఇక్కడ పనిచేసి బదిలీ అయిన అధికారులు, పదవీ విరమణ పొందిన అధికారితోపాటు ఇతర అధికారులు విచారణకు హాజరయ్యారు. గట్టు పంచాయతీలో రూ.22 లక్షలను ఎలాంటి తీర్మానాలు లేకుండా డ్రా చేసుకున్నట్లు వార్డుసభ్యుడు సంతోష్ విచారణ అధికారుల దృష్టికి తెచ్చారు. మినిట్స్ బుక్ రాయలేదని, 8 నెలలుగా గ్రామసభ నిర్వహించలేదని, పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి రూ.90 వేలు ఖర్చు చేశారని ఆరోపించారు. గ్రామ కార్యదర్శులు నకిలీ తీర్మానాలతో బిల్లులు డ్రా చేసుకున్నారని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని వార్డు సభ్యులు డిమాండ్ చేశారు. హరిజన వాడ పాఠశాలను కూల్చివేశారని, ఉన్నత పాఠశాలలో భవనాల కూల్చివేతకు ఎవరి అనుమతులు తీసుకున్నారనే విషయాలు బహిర్గతం చేయాలని మాజీ ఎంపీటీసీ కృష్ణ కోరారు. రైతువేదిక దగ్గర భారత్‌మాల కాంట్రాక్టర్ మట్టి వేస్తే పంచాయతీ వారు తాము చేసినట్లు నిధులను డ్రా చేసుకున్నారని, పంచాయతీ సర్పంచులకు సంబంధించిన డీజిటల్ కీలను కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. గట్టు గ్రామంలో 10 శాతం స్థలాలు అన్యాక్రాంతమయ్యాయని వాటిపై విచారణ చేయాలని విన్నించారు.
● విచారణ అధికారి, డిప్యూటీ సీఈఓ నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ గట్టు గ్రామస్తులు ఫిర్యాదు మేరకు రూ.10 లక్షలకు సంబందించిన అంశాలపై మాత్రమే తాను విచారణకు వచ్చినట్లు చెప్పారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను గ్రామ కార్యదర్శుల ద్వారా సేకరించి.. ఎంబీ రికార్డులను పరిశీలించారు. ముగ్గురు కార్యదర్శులు మునినాయక్, కుర్మన్న, జగన్నాథరావులను విచారించారు. అనంతరం ప్రత్యేకాధికారుల పాలనలో ఖర్చు చేసిన నిధులు, రైతువేదికతోపాటు ఇతర చోట్ల చేపట్టిన పనులను విచారణ అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో డీఎల్‌పీఓ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీడీఓ చెన్నయ్య, ఎంపీఓలు ఖాజా, రవికుమార్, ఏఈఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


