గద్వాల: జిల్లాలో ఎస్సీల సమగ్ర అభివృద్ధికి అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుతో కలిసి ఎస్సీ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్ వినియోగంపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను అర్హులైన కుటుంబాలకు నేరుగా ప్రయోజనం చేకూరేలా వినియోగించాలని, లబ్ధిదారుల వివరాలపై శాఖల వారీగా నివేదిక సమర్పించాలని సూచించారు. అలంపూర్ రిజర్వుడ్ నియోజకవర్గ ప్రతి అర్హత కుటుంబానికి ప్రభుత్వ పధకాలు అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే విజయుడు కోరారు.
ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు
గణేష్ ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం వినాయక చవితి ఏర్పాట్లపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండపాల నిర్వాహకులు విద్యుత్, భద్రత సర్టిఫికెట్ తీసుకోవాలని రాత్రి 10 గంటల తర్వాల మైక్ శబ్దాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. బీచుపల్లి, నదీ అగ్రహారం వద్ద కృష్ణానది వినాయకుల నిమజ్జనానికి క్రేన్లు, గజ ఈతగాళ్లు, ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్లు మదన్‌మోహన్, నర్సింగరావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


