గద్వాల: జిల్లా కేంద్రంలోని భీంనగర్‌లో 10 శాతం స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడంపై ఎట్టకేలకు మున్సిపల్ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. కట్టడాలను జేసీబీ సహాయంతో తొలగించారు. ఈ క్రమంలో ఉదయం నుంచి నిర్మాణం చేపడుతున్న వ్యక్తులకు మున్సిపల్ అధికారుల మధ్య నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సోమవారం నోటీసులు ఇచ్చినప్పటికీ మంగళవారం సదరు ఆక్రమణదారుడు నిర్మాణ పనులు యథావిధిగా మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకుని పనులు ఆపేయాలంటూ చెప్పారు. అయితే పనులు ఆపేయమంటూ సదరు వ్యక్తి అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం అధికారులు పనులు అడ్డుకొని బేస్‌మెంట్ నిర్మాణాన్ని తొలగించారు. అయితే మొత్తం నిర్మాణాన్ని తొలగించకుండా కొంత మేరకు తొలగించడంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. గతంలో పాత బస్టాండ్, రెండో రైల్వేగేటు ప్రాంతాల్లో మున్సిపల్‌కు చెందిన స్థలాల్లో అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించిన అధికారులు ఇక్కడ మాత్రం తూతూమంత్రంగా తొలగించి మమ అన్పించేలా దీని వెనుకాల అదృశ్య శక్తులు ఎవరనేది ఆసక్తికర చర్చకు తెరలేపింది. అక్రమ నిర్మాణాన్ని పూర్తిగా తొలగించి, మున్సిపల్ స్థలాన్ని అధికారులు సంరక్షిస్తారా లేక చేతులు దులిపేసుకుంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది.


