అక్షరాస్యులుగా మహిళా సంఘాల సభ్యులు
● ‘అమ్మకు అక్షరమాల’ పేరుతో చదవడం.. రాయడం నేర్పిస్తున్న వలంటీర్లు
● సెప్టెంబర్ చివరి వారంలో రెండో విడత పరీక్షల నిర్వహణకు కసరత్తు
గద్వాలన్యూటౌన్: రోజురోజుకూ సాంకేతికత అభివృద్ది చెందుతోంది. తద్వారా సమాజంలో పరిస్థితులు మారుతున్నాయి. చదువుకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతి ఒక్కరికీ కనీసంగా చదవడం.. రాయ డం రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ‘అమ్మకు అక్షరమాల’ పేరుతో నిరక్షరాస్యులైన స్వయం సహాయక సంఘాల సభ్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా జిల్లావ్యాప్తంగా నిరక్షరాస్యులను గుర్తించారు. వలంటీర్ల ద్వారా వారికి చదవడం, రాయడం నేర్పించి.. లక్ష్యం మేరకు మొదటి విడత పరీక్షలు మార్చిలో నిర్వహించారు. సెప్టెంబర్ చివరి వారంలో మిగిలిన వారికి రెండో విడత పరీక్షలు నిర్వహించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో గుర్తించిన నిరక్షరాస్యులు 53,257
ఉత్తీర్ణులైన
వారు
16,397
మొదటి విడతలో పరీక్ష రాసిన వారు 23,506
ఉత్తీర్ణులు కానివారు 7,109
రెండోవిడత పరీక్షకు హాజరు
కావాల్సిన వారు : 36,860
15ఏళ్లు పైబడిన వారికి..
ఎన్ ఈపీ–2020కు అనుగుణంగా 15 ఏళ్లు పైబడిన వారికి విద్య అందించడానికి కేంద్ర ప్రభుత్వం అండర్ స్టాండింగ్ లైఫ్‌లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ (ఉల్లాస్) పథకాన్ని తీసుకొచ్చింది. పాఠశాలలకు వెళ్లలేని వారికి చదువు నేర్పించడం ఈ పథకం ఉద్దేశం. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్)లోని వయోజన విద్యావిభాగం సైతం నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చేందుకు ఏర్పాటైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో గ్రామీణాభివృద్ధి సంస్థ (సెర్ఫ్), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.


