గద్వాలన్యూటౌన్: ఉపాధ్యాయ హక్కులు, భవిష్యత్ కోసం సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో పీఆర్టీయూ టీఎస్ తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు తిమ్మారెడ్డి కోరారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎస్ విధానం రద్దు, డీఎస్సీ– 2003 వారికి ఓపీఎస్, పీఆర్సీ అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహధర్నా నిర్వహించే ఇందిరాపార్క్ నీలిసంద్రంగా కన్పించేలా ప్రతి ఉపాధ్యాయుడు నీలి రంగు షర్ట్, చీర, చుడిదార్ ధరించి తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పీఆర్టీయూ టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, వెంకటేశ్, వాణి ప్రసాద్, ఎల్లస్వామి, ఈదన్న, కృష్ణ, గోవిందు, చంద్రశేఖర్, శ్రీధర్‌శెట్టి ఉన్నారు.
శ్రీశైలంలో 872.10 అడుగుల నీటిమట్టం
అచ్చంపేట: శ్రీశైలం జలాశయంలో ఆదివారం సాయంత్రం నాటికి 872.10 అడుగులు (150.8076 టీఎంసీలు)గా నమోదైంది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు జలవిద్యుత్ కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ.. 5,075 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. జలాశయంలో శనివారం 153.5060 టీఎంసీలు ఉండగా.. విద్యుత్ ఉత్పత్తి, సాగు, తాగునీటి అవసరాల కోసం సుమారు 3 టీఎంసీల నీటిని వినియోగించారు. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 8.657 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టారు. విద్యుత్ ఉత్పాదన అనంతరం నాగర్జునసాగర్‌కు 17,320 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి రాయలసీమ తాగునీటి అవసరాలు, సాగునీటి పథకాల కోసం నీటిని తరలిస్తున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: గ్రూప్–1, 2 ,3, 4 పరీక్షలకు సిద్ధమయ్యే మైనార్టీ వర్గాలకు చెందిన డిగ్రీ పాసైన యువతకు జనరల్ స్టడీస్‌లో ఉచిత ఫౌండేషన్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ అధికారి విష్ణునందన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీపీఎల్ కేటగిరీ కింద అర్హులైన ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలు, బౌద్ధులు మంగళవారం నుంచి 14 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్, ఇందిర ప్రియదర్శిని డిగ్రీ కళాశాల ప్రాంగణం, ఎంఏఎం క్యాంపస్, ఇంటర్మీడియట్ బోర్డు వెనుక, శ్రీబాలాజీ ఎన్‌క్లేవ్, నాంపల్లి, హైదరాబాద్ అనే చిరునామాకు పంపుకోవాలన్నారు. ఎంపికై న వంద మందికి అక్కడే సెప్టెంబర్ 15 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు.


