గద్వాల: కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పలు కళాశాలల్లో ఫీజుల బకాయి–బీజేపీ లడాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో చదువుకు దూరమయ్యే ప్రమాదం నెలకొందన్నారు. వెంటనే బకాయి నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు బండల వెంకట్రాములు, జయశ్రీ, నర్సింహులు, సమత, పరమేశ్వర్‌రెడ్డి, నర్సింహ, పాండు, పవన్ పాల్గొన్నారు.
అన్నదాతకు
మద్దతుగా పోరాటం
అమరచింత: ఎగువ నుంచి వస్తున్న వరదను తోడుకునే వీలున్నా.. దిగువన ఉన్న ఆంధ్రాకు పంపుతామంటే ఇక్కడి రైతులు చోద్యం చూస్తూ ఉండరని, అన్నదాతలకు మద్దతుగా బీఆర్‌ఎస్ పార్టీ పోరాడుతుందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆత్మకూర్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరువు ఉందని, సాగునీరు ఇవ్వలేమని.. ఆరుతడి పంటలు సాగు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులతో కలిసి రైతులను భయపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో మూడేళ్లకుపైగా వర్షం కురవకపోయినా ఇక్కడి ప్రాజెక్టులకు నీటి కొరత ఉండదని.. పచ్చిమ కనుమల్లో దట్టమైన అడవులు ఉండటంతో ప్రతి వర్షాకాలంలో తుంగభద్ర, కృష్ణా, భీమానదులు ఉధృతంగా పారుతుంటాయని వివరించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని 19 నియోజకవర్గాలకు ఎల్లూరు నుంచి 9 టీఏంసీల నీరు అవసరమని.. వచ్చే జూన్ వరకు మిషన్ భగీరథ నీటికి ఇబ్బంది లేదని, వీటిని సాకుగా చూపు తూ జూరాల ఆయకట్టును ఎండబెట్టుదామనే ఆలోచనలో ఇక్కడి మంత్రి ఆలోచించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.


