● కొలువుదీరిన డీసీసీ కార్యవర్గాల ప్రమాణ స్వీకారం
● టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
పర్యటనతో శ్రేణుల్లో ఉత్సాహం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, నాగర్‌కర్నూల్: ఒకప్పుడు వెనుకబాటుకు గురైన పాలమూరు ప్రస్తుతం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సొంత జిల్లా అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిసారించిందని తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రాల్లో డీసీసీ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరును మేటి జిల్లాగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికేంద్రీకరించారని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ పర్యటన కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.
జాతీయ హోదా కోసం పోరాటం..
ఉమ్మడి జిల్లాలో పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి ఆయకట్టు రైతులకు సాగునీటితోపాటు హైదరాబాద్‌కు తాగునీరు అందించడం తమ ప్రభు త్వ లక్ష్యమని మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. కేంద్రం ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తే ప్రాజెక్ట్ త్వరగా పూర్తవుతుందన్నారు. ఇందుకోసం కాంగ్రెస్ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. విభజన హామీల్లో జాతీయ హోదాతోపాటు చాలావరకు హామీలను కేంద్రం నెరవేర్చలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌సావంత్, సీడబ్లూసీ సభ్యు డు చల్లా వంశీచంద్‌రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు బాలాజీసింగ్ పాల్గొన్నారు.


