ఎర్రవల్లి: ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేసిన ప్రతిరైతుకు తప్పకుండా ఒరిజినల్ రశీదు ఇవ్వాలని జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప అన్నారు. మంగళవారం మండలంలోని పుటాన్‌దొడ్డి రైతువేదికలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల డీలర్లకు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం నిషేధించిన హెచ్‌టీ కాటన్ విత్తనాలను డీలర్లు విక్రయించరాదన్నారు. రైతులకు యాప్ ద్వారానే యూరియాను ఎమ్మార్పీకి విక్రయించాలని సూచించారు. యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రతి డీలర్ స్టాక్ బుక్, బిల్లు బుక్కులు, స్టాక్ బోర్డును ప్రతిరోజు అప్‌డేట్ చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇటీవల నిషేధించిన పారాక్విట్ గడ్డి మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించరాదని, షాపుల్లో కూడా నిల్వ ఉంచరాదని సూచించారు. ప్రభుత్వ అనుమతులు ఉన్న వాటిని మాత్రమే డీలర్లు విక్రయించాలని, ప్రతినెలా 5వ తేదీ లోగా మండల వ్యవసాయ అధికారికి స్టాక్ రిపోర్టు అందజేయాలని కోరారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి లైసెన్స్ లేకుండా అక్రమంగా క్రయవిక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఏఓ సక్రియనాయక్, ఏఓ సురేష్‌గౌడ్, ఏఈఓలు, డీలర్లు పాల్గొన్నారు.


