● మూడురోజుల నుంచి పెరిగిన ఎండలు
పాలమూరు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా భానుడు సెగలు కక్కుతున్నాడు. 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉదయం 9 గంటల నుంచే బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడే ఎండలు ఇంతలా మండుతుంటే.. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఇంకెంత పెరుగుతాయోనని ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో వడదెబ్బ ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సూర్యుడు నిప్పులు చెరుగుతుండగా వాతావరణ కాలుష్యంతో వేడి తీవ్రత మరింత అధికమవుతోంది. జిల్లాలో ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చిన్నపిల్లల వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం పెరిగిన ఎండల తీవ్రత వల్ల ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఏర్పాటు చేసుకునే పనిలో ప్రతిఒక్కరూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఫ్యాన్ల నుంచి వేడి గాలులు వస్తున్న క్రమంలో వచ్చే వారంరోజుల్లో కూలర్ల కొనుగోళ్లు అధికంగా పెరగనున్నాయి.
● ఉమ్మడి పాలమూరులో ఎండల తీవ్రత దృష్ట్యా అన్ని పీహెచ్‌సీల్లో అవసరమైన మందులతోపాటు ఓఆర్‌ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో దినసరి కూలీలు, రైతులు, ఉపాధి హామీ కూలీలు ఇలా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో ఆశాలు, ఏఎన్‌ఎంలు ఇంటింటికి తిరుగుతూ ఓఆర్‌ఎస్ పాకెట్లు పంపిణీ చేయాలని పలువురు సూచిస్తున్నారు.


