కానరాని రొయ్య | - | Sakshi
Sakshi News home page

కానరాని రొయ్య

Mar 10 2026 7:25 AM | Updated on Mar 10 2026 7:25 AM

గద్వాల వ్యవసాయం: జిల్లాలో గడిచిన ఏడాది (2024– 25) రొయ్యల సీడ్‌ను వదలలేదు. ఈసారి కూడా ప్రభుత్వం బడ్జెట్‌ను అరకొరగా కేటాయించడంతో రొయ్యల సీడ్‌ను తక్కువగా వదిలారు. ఇక్కడి జలాశయాలు, వాతావరణ పరిస్థితులు రొయ్యల సాగుకు అనుకూలంగా ఉండి.. రొయ్యల ఉత్పత్తి బాగున్నా.. ప్రభుత్వ నిర్వాకం మూలంగా సాగు, ఉత్పత్తి తగ్గుతున్న పరిస్థితులు దాపురించాయి. ఫలితంగా రొయ్యల విక్రయాలతో జీవనోపాధి పొందుతున్న మత్స్యకారులు నష్టపోవాల్సి వస్తుంది.

జిల్లాలో నీటి వనరులు..

జోగుళాంబ గద్వాల జిల్లాలో 93 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా.. ఇందులో 7,162 మంది మత్స్యకారులు ఉన్నారు. వీరే కాక మరో 3వేల మంది దాకా కుటుంబ సభ్యులున్నారు. ఈ కుటుంబాలకు చేపలు, రొయ్యల పెంపకం, విక్రయించడమే జీవనాధారం. జిల్లాలో కృష్ణ, తుంగభద్ర నదులు, జూరాల ప్రాజెక్ట్‌, శ్రీశైలం బ్యాక్‌వాటర్‌, 6 రిజర్వాయర్లు, 38 నోటిఫైడ్‌ చెరువులతోపాటు వందల సంఖ్యలో చిన్న చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో ఏటా మత్స్యశాఖ అందించే చేపల, రొయ్యల సీడ్‌ను వదిలి పెంచుతున్నారు.

ఆలస్యంగా.. తక్కువగా

రొయ్యల సాగు, ఉత్పత్తిలో భాగంగా రొయ్య సీడ్‌ కోసం ప్రభుత్వం రాష్ట్ర మత్స్యశాఖకు బడ్జెట్‌ కేటాయిస్తుంది. ఈ బడ్జెట్‌తో రొయ్యల సీడ్‌కు సంబంధించి మత్స్యశాఖ రాష్ట్రస్థాయిలో టెండర్లు ఆహ్వానిస్తుంది. టెండర్లు దక్కించుకునే కాంట్రాక్టర్‌ ఆయా జిల్లాలకు నిర్దేశించిన సీడ్‌ సంఖ్య ప్రకారం సప్లయ్‌ చేస్తారు. అయితే 2024– 25 సంవత్సరానికి సంబంధించి రొయ్యల సీడ్‌ కోసం ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయించకపోవడంతో రొయ్యలను వదలలేదు. ప్రస్తుత సంవత్సరం (2025– 26) సంబంధించి ప్రభుత్వం బడ్జెట్‌ ఆలస్యంగా, తక్కువ కేటాయించింది. దీంతో జిల్లాలోని జలాశయాల్లో 22లక్షల రొయ్యల సీడ్‌ మాత్రమే వదిలారు. జలాశయాల్లోని నీటి లభ్యత ఆధారంగా ఏటా వదిలే సీడ్‌ సంఖ్య పెంచాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా తగ్గిస్తూ వస్తోంది.

మార్కెట్‌లో మంచి డిమాండ్‌..

రొయ్యలు బోన్‌లెస్‌గా ఉండటంతో వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటుంది. గద్వాల ప్రాంతంలో కిలో రూ.300–400 వరకు ధరలున్నాయి. అయితే రొయ్యల సీడ్‌ వదిలిన ఆరేడు నెలల తర్వాత వీటిని పట్టుకొని విక్రయించాల్సి ఉంటుంది. అయితే మత్స్యకారులు అర్ధరాత్రి రిజర్వాయర్లలోకి వెళ్లి వలలు కట్టి, తిరిగి తెల్లవారుజామున వాటిని తీసుకొస్తారు. కాగా రొయ్య సీడ్‌ను వదలకపోవడంతో మత్స్యకారులు గడిచిన ఏడాది ఆర్థికంగా నష్టపోయారు. ఐదేళ్ల రొయ్యల ఉత్పత్తిని బట్టి గతేడాది (2024– 25) 286 టన్నుల ఉత్పత్తి నష్టపోయారు. అలాగే 2023– 24తో పోల్చితే ఈసారి 10 లక్షల తక్కువ సీడ్‌ వదిలారు. ఇలా తక్కువ వదలడం వల్ల ఈ ఏడాది కూడా మత్స్యకారులు నష్టపోయే పరిస్థితి ఏర్పడనుంది.

జిల్లాలో గణనీయంగాతగ్గుతున్న సీడ్‌ విడుదల

అరకొరగా బడ్జెట్‌

కేటాయింపులు

గతేడాది పూర్తిగా ఎగనామం పెట్టిన ప్రభుత్వం

అనుకూలమైన పరిస్థితులున్నామీనమేషాలు

జీవనోపాధి కోల్పోతున్న మత్స్యకారులు

ప్రభుత్వ నిర్ణయమే..

జిల్లాలోని జలాశయాలు రొయ్యల ఉత్పత్తికి అనుకూలంగా ఉన్నాయి. అయితే 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని జలాశయాల్లో 22 లక్షల సీడ్‌ వదలాలని ప్రభుత్వం నిర్దేశించింది. దీని ప్రకారం జనవరి, ఫిబ్రవరి మొదటి వారం నాటికి రొయ్యల సీడ్‌ను వదిలాం. సీడ్‌ తక్కువ చేయడం, ఎక్కువ చేయడం ప్రభుత్వ నిర్ణయం ఆధారపడి ఉంటుంది.

– షకీలాబానో, జిల్లా మత్స్యశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement