సాక్షి, నాగర్‌కర్నూల్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులతో పాటు ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గతంలోనే పాలమూరు–రంగారెడ్డి పనులను పూర్తి చేసేందుకు ఈ ఏడాది మార్చి వరకు గడువు విధించింది. అయితే తాజాగా ప్రభుత్వం మరో 20 నెలల్లో పూర్తి చేసేందుకు లక్ష్యం పెట్టుకుంది. మొత్తానికి 2027 నవంబర్ వరకు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ని వినియోగంలోకి తె స్తామని ప్రభుత్వం చెబుతుండగా, ఈసారైనా అనుకున్న సమయానికి పూర్తి కావాలంటే అవసరమైన నిధులు కేటాయిస్తేనే పనుల్లో కదలిక వస్తుంది.
భూసేకరణ వేగవంతం..
పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తిచేసేందుకు ప్రధానంగా భూసేకరణ సమస్యలు అడ్డంకిగా ఉన్నాయి. ఏళ్ల కిందట ప్రాజెక్ట్ పనులు మొదలుపెట్టినా ఇప్పటి వరకు భూసేకరణ పూర్తి కాలేదు. ఈ ఏడాది జూన్ 2 లోగా ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్ట్‌ల భూసేకరణ పూర్తి చేయడంపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించింది. దీనితో పాటు పెండింగ్‌లో ఉన్న పునరావాస ప్యాకేజీలను సైతం పూర్తి చేసేందుకు మొత్తం రూ.5 వేల కోట్లు నిధులు అవసరం కానున్నాయి.
నిధులు వస్తేనే పనులు..
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పూర్తి చేయడంలో నిధుల కేటాయింపు విషయమే కీలకంగా మారింది. 2014లో మొత్తం రూ.35,200 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్ట్‌ను ప్రారంభించగా ఏటా ప్రాజెక్ట్ వ్యయం గణనీయంగా పెరుగుతోంది. డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లతో కలిపి ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే ఇంకా రూ.50 వేల కోట్లు అవసరం. అయితే ప్రభుత్వం రెండేళ్ల కాలంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు ఇంకా రూ. 22 వేల కోట్లు కేటాయించేందుకు ప్రణాళిక రూపొందించింది. అయితే మిగతా నిధులు విడుదల చేస్తేనే ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి రానుంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కోసం రూ.909 కోట్లు, కోయిల్‌సాగర్ రూ.185 కోట్లు, భీమా ఎత్తిపోతలకు రూ.220 కోట్లు, నెట్టెంపాడు కోసం రూ.252 కోట్లను వచ్చే ఏడాది కాలంలో ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ మేరకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తేనే ప్రాజెక్టుల పనుల్లో పురోగతి ఉండనుంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపైనే ఆశలు..
పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తిచేస్తేనే ఉమ్మడి జిల్లాకు పూర్తిస్థాయిలో ప్రయోజనం కలుగనుంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల కింద నార్లాపూర్, ఏదుల, కర్వెన, వట్టెం, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తికావచ్చాయి. పంప్‌హౌజ్‌ల్లో మోటార్ల బిగింపు, కాల్వల తవ్వకాలు కొనసాగుతున్నాయి. నార్లాపూర్ నుంచి ఏదుల ప్రధాన కెనాల్‌లో కుడికిళ్ల వద్ద 2.5 కి.మీ. మేర కెనాల్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అలాగే డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణం కోసం ఇంకా రూ.50 వేల కోట్లు అవసరం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల పనులు పూర్తి చేసేందుకు భారీస్థాయిలో నిధులు కేటాయించాల్సి ఉండగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపైనే ఉమ్మడి జిల్లావాసులు ఆశలు పెట్టుకున్నారు.
‘పాలమూరు–రంగారెడ్డి’ పనులు పూర్తి చేసేందుకు మరోసారి గడువు పెంపు
20 నెలల్లో పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించిన ప్రభుత్వం
వచ్చేమార్చిలోగా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ పెండింగ్ పనులు పూర్తి
అనుకున్న సమయానికి పనులకు కావాలంటే నిధులు తప్పనిసరి..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపైనే ఉమ్మడి జిల్లావాసుల ఆశలు


