మూడేళ్లుగా నిరాశే..
తగ్గిన సాగు విస్తీర్ణం..
● ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్న అన్నదాతలు
● జిల్లావ్యాప్తంగా 24,500 ఎకరాల్లో సాగు
● మూడేళ్లుగా వాతావరణం
అనుకూలించక నష్టాలు
మానవపాడు మండలం చెన్నిపాడు శివారులో ఎండుమిర్చిని మండె వేస్తున్న రైతులు
గద్వాల వ్యవసాయం: ఎండుమిర్చికి మార్కెట్‌లో మంచి ధరలు లభిస్తున్నాయి. వరుసగా మూడేళ్లు అటు దిగుబడులు లేక.. ఇటు ధరలు రాక రైతులు ఆర్థికంగా తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది (2025–26) సైతం వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఎండుమిర్చి పంట దిగుబడులు కాస్త తగ్గినా.. ధరలు బాగా వస్తుండటంతో రైతులు ఊరట చెందుతున్నారు.
జిల్లా రైతులు 15 ఏళ్లుగా ఎండుమిర్చి సాగుపై దృష్టిసారిస్తున్నారు. బోరుబావుల కింద, నల్లరేగడి భూముల్లో వర్షాధారంపై మిర్చిసాగు చేస్తున్నారు. వాతావరణం అనుకూలించి పంట ఆశించిన స్థాయిలో చేతికి వస్తే.. పత్తి కన్నా మిర్చికి మంచి ధరలు లభిస్తాయి. ఎకరాకు 15 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా.. రూ. 60వేల నుంచి రూ. 70వేల వరకు సాగు ఖర్చులు అవుతాయి. కరుణ, సూపర్‌టెన్, జిత్రి, కావేరి, తేజచిల్లి, బ్యాడిగ తదితర రకాలను ఎక్కువగా ఈ ప్రాంతంలో రైతులు సాగు చేస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా 2022–23లో 36వేల ఎకరాలు, 2023–24లో 65,113 ఎకరాల్లో ఎండుమిర్చి సాగుచేశారు. పంట బాగా వస్తుందనుకునే సమయంలో త్రిప్స్, ఎండుమడత, జెమిని తెగుళ్లు ఆశించడంతో దిగుబడులు తగ్గి రైతులు ఆర్థికంగా నష్టపోయారు. ఎకరాకు కేవలం 8 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. ఇదే సమయంలో ధరలు కూడా పడిపోయాయి. నెలల తరబడి శీతల గిడ్డంగుల్లో రైతులు నిల్వ ఉంచుకున్నారు. ఇక గతేడాది (2024–25) 34,073 ఎకరాల్లో పంట సాగైంది. మొదటి మూడు నెలలు పంట బాగా వచ్చింది. ఆ తర్వాత తెగుళ్లు, వాతావరణ పరిస్థితులతో దిగుబడులు ఆశించిన స్థాయిలో రాలేదు. మరోవైపు కొన్ని రకాలకు క్వింటాకు రూ. 15వేల నుంచి రూ. 25వేల ధర రావాల్సి ఉండగా.. రూ. 8వేల నుంచి రూ. 12వేల ధరలు మాత్రమే వచ్చాయి. మరికొన్ని రకాలకు రూ. 45వేల నుంచి రూ. 50వేల ధర రావాల్సి ఉండగా.. రూ. 30వేల నుంచి రూ. 40వేలు మాత్రమే వచ్చాయి. ఇలా వరుసగా మూడేళ్లు మిర్చి రైతులు ఆర్థికంగా నష్టాలు చవిచూశారు.
రకం ధర (రూ.పాలలో)
సూపర్‌టెన్ 20వేలు – 25వేలు
చిన్‌జెంట బేడిగ 32వేలు – 43వేలు
తేజ 16వేలు – 19వేలు
కడ్డి బేడిగ 45వేలు – 65వేలు
వరుసగా మూడేళ్ల పాటు తెగుళ్ల కారణంగా పంట దిగుబడులు తగ్గిపోవడంతో పాటు ధరలు రాలేదు. దీంతో ఎండుమిర్చి 33,472 ఎకరాల్లో సాగు అంచనా ఉండగా.. ఈ సారి 24,500 ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఈ ఏడాది సైతం వాతావరణం పూర్తిస్థాయిలో అనుకూలించలేదు. అధిక వర్షాలకు కొంత పంటలు దెబ్బతిన్నాయి. తెగుళ్ల నివారణ కోసం రైతులు అధికంగా ఖర్చు చేశారు. అయినప్పటికీ కొంత దిగుబడులు తగ్గాయి. ఇదిలా ఉంటే.. ఎండుమిర్చి పంట గత జనవరి మూడో వారం నుంచే పలుచోట్ల చేతికొచ్చింది. ఈ నెల మొదటి వారం నుంచి రైతులు కోతలు ప్రారంభించారు. ఇక్కడి రైతులు కర్నూలు, గుంటూరు, రాయచూర్, హైదరాబాద్ మార్కెట్లకు మిర్చిని తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో నాణ్యత, రకాన్ని బట్టి మంచి ధరలు లభిస్తున్నాయి. కాగా, ఈ ఏడాది ఎండుమిర్చి సాగు తగ్గినందున.. ఈ నెల చివరి వారం నుంచి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెటింగ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో చాలా మంది రైతులు గిడ్డంగుల్లో నిల్వ ఉంచుకుంటున్నారు.


