సులభంగా అర్థమయ్యేలా బోధించాలి
గద్వాల(గట్టు): విద్యార్థులు సులభంగా పాఠ్యాంశాలను అర్థం చేసుకునే విధంగా బోధించాలని డీఈఓ విజయలక్ష్మి ఉపాధ్యాయులకు సూచించారు. గురువారం ఆలూరు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యాబోధన తీరును పరిశీలించారు. ఐఎఫ్‌పీ పద్ధతిలో పాఠ్యాంశ బోధన చేయాలని.. పాఠ్యపుస్తకాల్లో ఉన్న విషయం పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా బోధన ఉండాలని ఉపాధ్యాయులకు సూచించారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను విజయవంతంగా నిర్వహించి.. వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. అనంతరం న్యూట్రీషన్ కిచెన్, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి విద్యార్థులకు తెలుగు, గణితం ప్రాథమిక స్థాయి ప్రమాణాలను పరిశీలించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించాల ని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల ప్రహరీకి గేట్‌ను అమర్చుకోవాలని తెలిపారు.


