క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు తేవాలి
గద్వాల: సీఎం కప్ క్రీడా పోటీల్లో స్థానిక క్రీడాకారులు ఉత్తమ ప్రతిభకనబరిచి జిల్లాకు పేరు తీసుకురావాలని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు బయలుదేరిన క్రీడాకారుల బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో విజయం సాధించిన క్రీడాకారులను అభినందిస్తూ.. రాష్ట్రస్థాయిలో సైతం ఇదే స్ఫూర్తితో రాణించాలని క్రీడాకారులకు సూచించారు. పోటీల్లో గెలుపు మాత్రమే లక్ష్యం కాకుండా.. క్రీడాస్ఫూర్తితో రాణించాలన్నారు. ఓటమికి భయపడకుండా నిరంతర సాధన చేయాలన్నారు. ప్రయత్నమే విజయానికి మార్గమన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడలశాఖ కృష్ణయ్య పాల్గొన్నారు.


