వందశాతం లక్ష్యాలు సాధించాలి
గద్వాల(గట్టు): సంపూర్ణ అభియాన్‌లో నిర్దేశించిన లక్ష్యాలను వందశాతం సాధించేందుకు సంబంధిత అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆస్పిరేషనల్ ప్రోగ్రాం సెంట్రల్ అధికారిణి మానస గంగోత్రి కాట అన్నారు. నీతి అయోగ్ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఆస్పిరేషనల్ ప్రోగ్రాంకు ఎంపికై న గట్టు మండలంలో గురువారం కలెక్టర్ బీఎం సంతోష్‌తో కలిసి కేంద్ర బృందం పర్యటించింది. ముందుగా గట్టు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కేంద్ర బృందం జిల్లా, బ్లాక్ అధికారులతో సమావేశమై పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మానస గంగోత్రికాట మాట్లాడుతూ.. అక్షరాస్యత పరంగా వెనుకబడిన మండలాన్ని విద్యారంగంలో ప్రగతి సాధించడంతో పాటు అన్ని రంగాల్లో పురోగతి సాధించడమే ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశమన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే వివిధ రుణాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ బీఎం సంతోష్ మాట్లాడుతూ.. గతేడాది ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో చూపిన ప్రతిభకు జాతీయస్థాయిలో 5వ, దక్షిణ భారతదేశంలో 2వ స్థానం సాధించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూ. కోటి అందించడమే కాకుండా గవర్నర్ నుంచి ప్రశంశలు పొందినట్లు చెప్పారు. అనంతరం సంపూర్ణ అభియాన్ పోస్టర్లు విడుదల చేశారు. జేఈఈ, మెయిన్స్‌కు అర్హత సాధించిన ఇద్దరు గురుకుల బాలికలను వారు సన్మానించి అభినందించారు. అదే విధంగా గట్టు కేజీబీవీ, ఉన్నత పాఠశాలలను పరిశీలించారు. ఉన్నత పాఠశాలలో భవిష్యభారత్ సంస్థ ఏర్పాటుచేసిన మరుగుదొడ్లను ప్రారంభించారు. పలువురు విద్యార్థులకు సైకిళ్లు, మరో 13 మందికి ల్యాప్‌టాప్‌లను అందజేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడి నుంచి ఆలూరు ప్రాథమిక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం మెనూను పరిశీలించారు. పెంచికలపాడు అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారంపై ఆరా తీశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, డీఈఓ విజయలక్ష్మి, డీడబ్ల్యూఓ సునంద, డీఎంహెచ్‌ఓ సంధ్యాకిరణ్మయి, పంచాయతీరాజ్ డీఈ లక్ష్మన్న, తహసీల్దార్ విజయకుమార్, ఎంపీడీఓ చెన్నయ్య, ఎంఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి
సాధించడమే ఆస్పిరేషనల్
ప్రోగ్రాం లక్ష్యం
కేంద్ర అధికారిణి
మానస గంగోత్రి కాట


