దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
ధరూరు: దేశాభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా పూలే ఉమెన్స్ డిగ్రీ కళాశాల 2వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించి మాట్లాడారు. దేశం అభివృద్ధి చెందాలంటే ముందుగా మనల్ని మనం అభివృద్ధి చేసుకోవాలన్నారు. నేటి విద్యార్థులే భావిభారత పౌరులని.. విద్యార్థులు ప్రస్తుత పరిణామాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించాలని, పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు కళాశాలలో అందుబాటులో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎస్సైకు సూచించారు. విద్యకు అధిక ప్రాధాన్యం ఉందని.. లక్ష్యం స్పష్టంగా ఉండాలని, ప్రత్యేక శ్రద్ధ, క్రమశిక్షణతో ఛేదించాలన్నారు. అనంతరం సైబర్ సెక్యూరిటీ విభాగం, షీటీం, భరోసా కేంద్రం, కళాజాత బృందం విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఉస్సేనప్ప, సహాయ ప్రిన్సిపాల్ పుష్పాంజలి, సర్పంచ్ డీఆర్ విజయ్‌కుమార్, షీటీం ఎస్సై వెంకటస్వామి, ఎస్సై నందికర్, సైబర్ క్రైం సిబ్బంది పాల్గొన్నారు.


