ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
గద్వాల: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 25 నుంచి మార్చి 16వ తేదీ వరకు జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా 14 కేంద్రాల్లో 8,471 మంది విద్యార్దులు పరీక్షలకు హాజరవుతారని.. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,366 మంది, ద్వితీయ సంవత్సరంలో 4,105 మంది ఉన్నారన్నారు. పరీక్షల పర్యవేక్షణకు చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్‌మెంట్ అధికారులను నియమించడంతో పాటు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయాల ని సూచించారు. ప్రశ్నపత్రాలను పోలీస్ ఎస్కార్ట్‌తో తరలించాలని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమ లు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఏఎస్పీ శంకర్, డీఐఈఓ హృదయరాజు తదితరుల ఉన్నారు.
● ఓటర్ల జాబితా సవరణకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి వీడియో కాన్సరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. ఎలాంటి తప్పిదాలు లేకుండా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలన్నారు. బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి నిర్దేశిత లక్ష్యాన్ని త్వరగా పూర్తిచేయాలని సూచించారు. కాగా, జిల్లాలో సుమారు 5 లక్షల మంది ఓటర్లు ఉన్నారని.. మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మల్దకల్, కేటీదొడ్డి మండలాల్లో మ్యాపింగ్ శాతం తక్కువగా ఉందని.. అక్కడ ఏమైన సమస్యలు ఉంటే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. వీసీలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ హరికృష్ణ పాల్గొన్నారు.


