ప్రకృతి వ్యవసాయం.. లాభదాయకం
ధరూరు/కేటీదొడ్డి: రైతులు ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక దృష్టిసారించి లాభాలు గడించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప సూచించారు. మంగళవారం ధరూరు రైతువేదికలో నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయంతో రైతులు నాణ్యమైన ఉత్పత్తులు సాధించడంతో పాటు ప్రజలకు ఆరోగ్యకర ఆహారం లభిస్తుందన్నారు. పంటల సాగులో మోతాదుకు మించి రసాయన ఎరువుల వాడకంతో భూసారం కోల్పోయి పంట దిగుబడిపై ప్రభావం చూపుతుందన్నారు. జగిత్యాల జిల్లా సిర్పూర్‌కు చెందిన రైతు నరేశ్ సాధారణ వరికి బదులుగా పుచ్చకాయలు సాగుచేసి అధిగ లాభాలు గడించారని గుర్తుచేశారు. వేసవిలో సాగు చేసుకునే కూరగాయల పంటలపై రైతుల సందేహాలను నివృత్తి చేశారు. అదే విధంగా కేటీదొడ్డి రైతువేదికను ఆయన ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. రైతులకు సరిపడా యూరియా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. డీఏఓ వెంట ఏడీఏలు సంగీతలక్ష్మి, సక్రియా నాయక్, ఏఓ శ్రీలత, ఎంఏఓ రాజవర్ధన్‌రెడ్డి ఉన్నారు.


