చివరికి.. కైవసం!
గద్వాల కోటపై ఎగిరిన కాంగ్రెస్ జెండా
ఉత్కంఠకు తెర..
గద్వాల మున్సిపాలిటీ హంగ్ ఏర్పడిన నేపథ్యంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రెండురోజుల పాటు తీవ్ర ఉత్కంఠ రేపింది. హైదరాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు క్యాంపు రాజకీయాలు చేశాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన 16 మంది కౌన్సిలర్లు, ఇద్దరు స్వతంత్రులు, ఒక ఎంఐఎం అభ్యర్థులతో కలిపి 19 మంది మెజార్టీతో మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకున్నారు. పైగా ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో రెండు ఎక్స్ అఫీషియో ఓట్లు కలుపుకొని వారి బలం 21కి చేరుకుంది. అలాగే బీఆర్‌ఎస్, బీజేపీలు కూటమిగా ఏర్పడి 18 స్థానాలు సాధించారు. అయితే వీరికి చైర్మన్ పదవి సాధించాలంటే 19 మ్యాజిక్ ఫిగర్ అసవరం. వీరు కూడా చివరి వరకు స్వతంత్రులను తమవైపు తిప్పుకొనేందుకు శాయశక్తులా కృషిచేసినా ఫలించలేదు. ఈ క్రమంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ కౌన్సిలర్లు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికను బహిష్కరించారు.
గద్వాల: జిల్లాకేంద్రమైన గద్వాల మున్సిపాలిటీని అధికార పార్టీ కై వసం చేసుకుంది. ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకుండా హంగ్ ఏర్పడటంతో హైదరాబాద్‌లో క్యాంపులు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే రెండురోజులపాటు చోటుచేసుకున్న పలు నాటకీయ పరిణామాల అనంతరం సోమవారం గద్వాల మున్సిపాలిటీలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం, చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికకు గెలుపొందిన 37 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. ముందుగా ప్రత్యేక వాహనంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మల్లురవి, 16 మంది కౌన్సిలర్లు, ఒక ఎంఐఎం, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు గద్వాల మున్సిపాలిటీకి చేరుకున్నారు. ఆ తర్వాత బీజేపీ, బీఆర్‌ఎస్ పా ర్టీలకు చెందిన కౌన్సిలర్లు ఎవరికి వారుగా వచ్చారు. అనంతరం ఉదయం 11 గంటలకు గెలుపొందిన కౌన్సిలర్లతో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు ప్రమాణ స్వీకారం చేయించారు.
ఓటువేయని ఎమ్మెల్యే బండ్ల..
ఎక్స్ అఫీషియో ఓటు వేసేందుకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గద్వాల మున్సిపాలిటీలో ఇది వరకే ఆప్షన్ ఇచ్చుకున్నారు. అయితే చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్ ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటు వినియోగించుకోలేదు. కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయిలో మెజార్టీ ఉండటంతో ఆయన ఓటును వినియోగించుకోలేదు. ఎక్కడా చిన్నపాటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
మున్సిపల్ చైర్‌పర్సన్‌గా జయలక్ష్మి, వైస్ చైర్మన్‌గా శంకర్
ప్రమాణ స్వీకారం చేయించిన అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు
అధికార పార్టీకి జైకొట్టిన
ఎక్స్ అఫీషియో, ఎంఐఎం,
స్వతంత్ర అభ్యర్థులు
బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసినా 11 ఓట్లే రావడంతో ఓటమి
అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బహిష్కరించిన బీజేపీ


