బీసీ బంద్‌ సంపూర్ణం | - | Sakshi
Sakshi News home page

బీసీ బంద్‌ సంపూర్ణం

Oct 19 2025 7:05 AM | Updated on Oct 19 2025 7:05 AM

బీసీ

బీసీ బంద్‌ సంపూర్ణం

గద్వాలటౌన్‌: స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా బీసీ జేఏసీ చేపట్టిన బంద్‌ జిల్లాలో సంపూర్ణమైంది. శనివారం తెల్లవారుజాము నుంచే జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ నాయకులతో పాటు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, వామపక్ష పార్టీల నాయకులు వేరువేరుగా మోటార్‌బైక్‌లపై తిరుగుతూ షాపులను బంద్‌ చేయించారు. వాణిజ్య దుకాణాలు, సినిమాహాళ్లు, విద్యా సంస్థలు, పెట్రోలు బంకులు స్వచ్ఛంద బంద్‌ను పాటించాయి. అన్ని వర్గాల ప్రజలు బంద్‌ పాటించి బీసీ రిజర్వేషన్ల ఆకాంక్షను చాటి చెప్పారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులను నడపాలని పోలీసులు చేసిన ప్రయత్నాలను జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, జేఏసీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బస్టాండ్‌ ప్రాంగణంతో పాటు ప్రధాన చౌరస్తాలలో నిరసన వ్యక్తం చేశారు. 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్‌ చేశారు. అయిజ, శాంతినగర్‌, ఎర్రవల్లి చౌరస్తా, అలంపూర్‌ చౌరస్తాలతో పాటు మండల కేంద్రాలలో బంద్‌ సంపూర్ణంగా ముగిసింది. బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆయా ప్రాంతాల జేఏసీ నాయకులు బంద్‌లో భాగస్వాములు అయ్యారు. గద్వాలలో బీజేపీ నాయకులు బంద్‌కు దూరంగా ఉన్నారు. ఈ సందర్బంగా ఆయా పార్టీల నాయకులు మాట్లాడారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించే వరకు బీసీలు చేసే పోరాటానికి తన మద్దతు ఉంటుందన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి సరిత మాట్లాడుతూ కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించి పంపిస్తే.. చట్టబద్ధత కల్పించకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆరోపించారు.

జేఏసీ నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, మధుసూధన్‌బాబులు మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు బీసీల ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు.

బీఆర్‌ఎస్‌ నాయకుడు హనుమంతునాయుడు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించే విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, బీసీల రిజర్వేషన్ల విషయంలో ఆ పార్టీలకు చిత్తశుద్ది లేదని విమర్శించారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బీజేపీ రాష్ట్రంలో మద్దతు ఇస్తూ.. కేంద్రంలో అడ్డుకుంటూ దోబూచులాట ఆడుతోందని వామపక్ష పార్టీల నాయకులు విమర్శించారు.

డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

గద్వాలలో బస్సులు నడపాలని పోలీసుల యత్నం

అడ్డుకున్న జేఏసీ నాయకులు.. ఇరువురి మధ్య వాగ్వాదం

వాణిజ్య దుకాణాలు, విద్యా సంస్థలు, పెట్రోలు బంకులు స్వచ్ఛంద బంద్‌

బీసీ బంద్‌ సంపూర్ణం 1
1/3

బీసీ బంద్‌ సంపూర్ణం

బీసీ బంద్‌ సంపూర్ణం 2
2/3

బీసీ బంద్‌ సంపూర్ణం

బీసీ బంద్‌ సంపూర్ణం 3
3/3

బీసీ బంద్‌ సంపూర్ణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement