
నీటి మునిగిన ముచ్చోనిపల్లె రోడ్డు
● రిజర్వాయర్ అలుగు వద్ద నిలిచిన నీరు
● రాకపోకలకు ఇబ్బందులు
గట్టు: ముచ్చోనిపల్లె రోడ్డు నీట మునిగింది. గొర్లఖాన్‌దొడ్డి–అయిజ రోడ్డు నుంచి కర్నూలు–రాయచూర్ రోడ్డుకు లింకు కలుపుతూ కొత్తగా ముచ్చోనిపల్లె రిజర్వాయర్ కట్ట కింద భాగంలో కొత్తగా తారురోడ్డును వేశారు. ప్రస్తుతం రిజర్వాయర్ అలుగు పారే చోట వర్షపు నీరు వచ్చి చేరింది. వాహనాలు పూర్తిగా నీట మునిగేటంత నీరు వచ్చి చేరడంతో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వైపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగా వేసిన తారు రోడ్డు అంతా బాగానే ఉన్నా, ముచ్చోనిపల్లె రిజర్వాయర్ అలుగు పారే చోట భూమి లెవల్ కంటే కాస్త లోతుగా మట్టిని తీసి, బ్రిడ్జి నిర్మించారు. అలుగు ద్వారా పారే నీరు బ్రిడ్జి కింద నుంచి బయటకు వెళ్లడానికి పెద్ద పెద్ద పైపులు ఏర్పాటు చేశారు. అయితే రిజర్వాయర్ నిండిన తర్వాత అలుగు ద్వారా పారే నీరు బయటకు వెళ్లడానికి కాల్వ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, భూ సేకరణ సమస్య కారణంగా కాల్వ నిర్మాణ పనులు అగిపోయాయి. అయితే వర్షాకాలంలో కురిసిన వర్షాల కారణంగా అలుగు కోసం మట్టిని తీసి, బ్రిడ్జి నిర్మించిన చోట భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. ఈ నీరు బయటకు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో అలుగు నీరు పారే చోట ఏర్పాటు చేసిన బ్రిడ్జి నీట మునిగింది. ఎంతలా అంటే వాహనాలు తారు రోడ్డు వెంట నేరుగా వెళితే నీట మునిగిపోయే విధంగా నీరు వచ్చి చేరాయి. తారు రోడ్డు ఉంది కదాని నేరుగా తెలియక ఈ దారి గుండా వెళ్లేవారు నీటిని చూసి భయపడుతున్నారు. నీరు నిల్వ ఉన్న చోటపై భాగంలో పొలం గట్టు వెంట ఉన్న మట్టిదారి గుండా అటు వైపునకు అతి కష్టం మీద వెళుతున్నారు. అధికారులు స్పందించి ముచ్చోనిపల్లె కొత్తరోడ్డుపై రాకపోకలు సాగించే విధంగా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.