భూభారతి చట్టంతో భూ సమస్యలు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

భూభారతి చట్టంతో భూ సమస్యలు పరిష్కారం

Apr 25 2025 8:22 AM | Updated on Apr 25 2025 8:22 AM

భూభార

భూభారతి చట్టంతో భూ సమస్యలు పరిష్కారం

మల్దకల్‌: ఎంతో కాలంగా భూసమస్యలతో ఇబ్బంది పడుతున్న రైతులకు భూభారతి చట్టం ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ రైతులకు సూచించారు. గురువారం మల్దకల్‌లో భూభారతి చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించగా.. కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ధరణిలో ఉన్న చిన్న చిన్న పొరపాట్ల కారణంగా రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారని, ప్రస్తుతం కొత్తగా వచ్చిన భూభారతిలో ధరణిలో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రత్యేక చట్టం చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రైతులు భూసమస్యలను స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలోనే పరిష్కరించుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగ పరచుకోవాలన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో పరిష్కారం కానీ సమస్యలు ఆర్డీఓ కార్యాలయంలో పరిష్కరించబడతాయన్నారు. భూభారతి ద్వారా తక్షణ రిజిస్ట్రేషన్‌తో పాటు సర్వే నంబరు, వ్యవసాయ భూమికి సంబంధించిన నక్ష ఉంటుందన్నారు. అదే విధంగా వారసత్వ భూములు, పెండింగ్‌ సాదా బైనామాల దరఖాస్తులను పరిష్కరించవచ్చన్నారు. మనిషికి ఆధార్‌కార్డు లాగే భూమికి భూదార్‌ సంఖ్యను కేటాయింపు చేస్తారని, భూ అక్రమాలకు అవకాశం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకే ప్రభుత్వం గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు చర్యలు తీసుకుంటుందని, అలాగే గ్రామాలలో ప్రజలకు భూభారతి చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టరు లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, తహశీల్దార్‌ షాహేదాబేగం, ఏఓ రాజశేఖర్‌, డిటీ ఝాన్సీరాణి, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.

భూభారతి చట్టంతో భూ సమస్యలు పరిష్కారం 1
1/1

భూభారతి చట్టంతో భూ సమస్యలు పరిష్కారం

Advertisement
 
Advertisement
Advertisement