TS Elections 2023: కాంగ్రెస్‌లో మంటలు | - | Sakshi
Sakshi News home page

TS Elections 2023: కాంగ్రెస్‌లో మంటలు

Oct 19 2023 1:32 AM | Updated on Oct 19 2023 11:54 AM

- - Sakshi

కాంగ్రెస్‌ పార్టీ జెండాలు, ప్లెక్సీలు దహనం చేస్తున్న పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు

జోగులాంబ గద్వాల: కాంగ్రెస్‌ పార్టీలో ముసలం మొదలైంది. అది ముదిరి కల్లోలంగా మారింది. ముందు నుంచి పార్టీకి సేవలందించిన వారికే టికెట్టు ఇవ్వాలంటూ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానానికి పదే పదే విన్నవించినా.. పాతవర్గం నాయకుల విన్నపాన్ని పెడచెవిన పెట్టింది. అందరూ ఊహించిన విధంగానే ఇటీవల పార్టీలో చేరిన జెడ్పీ చైర్‌పర్సన్‌ సరితకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ టికెట్‌ కేటాయించింది.

అసంతృప్తి రాగాలు..
గద్వాల కాంగ్రెస్‌ పార్టీలో టికెట్‌ ఆశించిన పాతవర్గం నాయకులు తమ అసంతృప్తి రాగాలను వివిధ రూపాల్లో ప్రదర్శిస్తున్నారు. సస్పెన్షన్‌ వేటుకు గురైన రాష్ట్ర పీసీసీ కార్యదర్శి కుర్వ విజయ్‌కుమార్‌ గాంధీభవన్‌ ఎదుట పీసీసీ అధ్యక్షుడి దిష్టిబొమ్మ దహనం చేసి, పార్టీ టికెట్‌ అమ్ముకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

తాజాగా డీసీసీ అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి పార్టీ సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమే ధ్యేయంగా పనిచేస్తానని ప్రకటించారు. ఇక టికెట్‌ ఆశిస్తూ వచ్చిన రాజీవ్‌రెడ్డి, వీరుబాబు, శంకర్‌, నారాయణరెడ్డిలు కాస్త పార్టీ కార్యక్రమాలకు, ఇతర వేదికలపై కనిపించకుండా అదృశ్యం కావడంతో కాంగ్రెస్‌ పార్టీలో కల్లోలం రేగింది.

డబ్బులున్నోళ్లకే పార్టీ టికెట్‌
కష్టకాలంలో పార్టీకి భుజం కాసి నెట్టుకొస్తే తీరా ఎన్నికల సమయానికి నమ్ముకున్నోళ్లని నట్టేటా ముంచి డబ్బులున్నోళ్లకే పార్టీ టికెట్‌ను రూ.కోట్లకు అమ్ముకున్నారని పార్టీకి రాజీనామా చేసిన డీసీసీ అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి, కుర్వ విజయ్‌కుమార్‌ బాహటంగానే ఆరోపణలు గుప్పిస్తుండటం సంచలనంగా మారింది.

ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై చేసిన ఆరోపణలు పెద్దఎత్తున చర్చకు దారితీశాయి. గతంలో సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ.. నడిగడ్డతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన డీకే అరుణకు సైతం అప్పట్లో సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, అడుగడుగున అవమానాలు, కోవర్టు రాజకీయాలు పార్టీని వీడిన సందర్భంగా డీకే అరుణ వ్యాఖ్యలు మరోసారి అందరు కూడా గుర్తుచేసుకోవడం కొసమెరుపు.

పటేల్‌ ఇంటికి జెడ్పీ చైర్‌పర్సన్‌..
టికెట్‌ ఆశించి భంగపడ్డ డీసీసీ అధ్యక్షుడిని బుజ్జగించేందుకు జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఆమె భర్త తిరుపతయ్య బుధవారం ఉదయం పటేల్‌ ఇంటికి వెళ్లారు. తమతో కలిసిరావాలని పార్టీకి మీరు చేసిన సేవలకు భవిష్యత్‌లో తప్పకుండా సముచిత స్థానం కల్పించి న్యాయం చేస్తుందని బుజ్జగించారు. అయితే పటేల్‌ పార్టీని వీడటంతో వీరి బుజ్జగింపులేమి ఫలించలేదని తేలిపోయింది.

కుర్వ విజయ్‌కుమార్‌ హైదరాబాద్‌లో భాగ్యలక్ష్మి ఆలయం ఎదుట రేవంత్‌రెడ్డిపై టికెట్లు అమ్ముకున్నారని.. మరోవైపు టికెట్టు ఆశించి భంగపడ్డ సీనియర్‌ నాయకులు రాజీవ్‌రెడ్డి, వీరుబాబు, శంకర్‌, నారాయణరెడ్డి ప్రస్తుతం కనిపించకుండా, మౌనంగా ఉండడంపై అసలు గద్వాల కాంగ్రెస్‌ పార్టీలో ఏమి జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది.

డబ్బులు ఇచ్చిన లీడర్లకే టికెట్లు
కాంగ్రెస్‌ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా 70 శాతం పారాచూట్‌, డబ్బులు ఇచ్చిన లీడర్లకు టికెట్లు ఇచ్చారని, పార్టీలో నమ్ముకుని పనిచేసిన నాయకులకు గుర్తింపులేదని డీసీసీ అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణ శివారులోని ఓ మిల్లులో విలేకరులతో మాట్లాడారు. 25 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ కోసం పని చేశానన్నారు. పదేళ్లుగా అధికారంలో లేకున్నా.. భరించి పనిచేస్తూ వచ్చామన్నారు.

పటేల్‌ ప్రభాకర్‌ రెడ్డి తన డీసీసీ అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి, మాజీ జెడ్పీటీసీ ఉమాదేవి, కేటీదొడ్డి మండల అధ్యక్షుడు విశ్వనాథ్‌ రెడ్డి, ధరూర్‌ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌ గౌడ్‌, గద్వాల మండల అధ్యక్షుడు రఘునాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు కర్ణాకర్‌, ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు శివనాయక్‌, పలువురు కార్యదర్శులతో పాటు ఆయన అనుచర వర్గం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా.. డీసీసీ అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ ప్లెక్సీలు, పోస్టర్లు, కండువాలను నాయకులు దహనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement