పలుచోట్ల రక్షణ చర్యలు.. | - | Sakshi
Sakshi News home page

పలుచోట్ల రక్షణ చర్యలు..

Oct 9 2026 1:20 AM | Updated on Oct 9 2026 1:20 AM

భూపాలపల్లి: వానర మూకలు ఆగం చేస్తున్నాయి. రోడ్లపై మనుషులు తిరగలేని పరిస్థితి నెలకొంటుంది. నిత్యం దాడులకు పాల్పడుతుండటంతో జిల్లాలో భయాందోళన పరిస్థితి నెలకొంది. రైతులు పండించే పంటలను సైతం నాశనం చేస్తుండటంతో పండ్లు, కూరగాయల పంటల సాగు చేసేందుకు రైతులు విముఖత వ్యక్తం చేస్తున్నారు.

కోతుల దాడిలో ఒకరి మృతి

జిల్లాలో 12 మండలాల్లో ప్రతీ గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. ఉదయం 6గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పట్టణాలు, పల్లెల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. చేతిలో ఏదైనా కవర్‌, బాక్స్‌ కనిపిస్తే చాలు.. ఒక్కసారిగా కోతుల గుంపు దాడులకు పాల్పడుతుంది. ఈ ఏడాది మే 1వ తేదీన భూపాలపల్లి పట్టణంలోని జవహర్‌నగర్‌ కాలనీలో కాలినడకన వెళ్తున్న కోసనగొట్టు హరికిషన్‌పై కోతులు దాడికి పాల్పడ్డాయి. దీంతో అతను అక్కడికక్కడే గుండెపోటుకు గురై మృతి చెందాడు. అత్యధికంగా భూపాలపల్లి, చెల్పూరు, కాళేశ్వరం, కాటారం పీహెచ్‌సీల పరిధిలో కోతుల దాడి కేసులు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి.

తరలించినా వచ్చేస్తున్నాయి..

జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కోతులను పట్టుకొని ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో వదిలేస్తున్నారు. అయినప్పటికీ కొద్దిరోజులకే మళ్లీ వచ్చేస్తున్నాయి. కోతుల బాధ నుంచి తప్పించుకునేందుకు మొగుళ్లపల్లి మండల కేంద్రంతో పాటు పిడిసిల్ల, పెద్దకోమటిపల్లి, ములకపల్లి పంచాయతీల ఆధ్వర్యంలో కొండెంగలను కొనుగోలు చేసి గ్రామాల్లో తిప్పుతున్నారు. సింగరేణి సంస్థ ఇటీవల ఆరు కొండెంగలను కొనుగోలు చేసి భూపాలపల్లి పట్టణంలో వదిలేసింది. మొదట్లో కోతులు వాటికి భయపడినప్పటికీ ఇప్పుడు ప్రభావం అంతగా లేదు. జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు రూ.లక్షలు వెచ్చించి ఐదారు సార్లు కోతులను పట్టించి ఏటూరునాగారం అభయారణ్యంలో వదిలేశారు. కాళేశ్వరంలో దేవస్థానానికి వచ్చే భక్తులపై కోతులు దాడి చేస్తుండటంతో పంచాయతీ ఆధ్వర్యంలో ఒక్కో కోతికి రూ.400 చొప్పున చెల్లించి 600 కోతులను పట్టించి తరలించారు. పంచాయతీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు టేకుమట్ల, వెంకట్రావ్‌పల్లి(బి), బూర్నపల్లి సర్పంచ్‌లు పలుమార్లు కోతులను పట్టించారు. అయినప్పటికీ ఆయా ప్రాంతాల్లో కోతుల బెడద తప్పలేదు.

అంతటా కోతుల సమస్య.. సర్వేలో వెల్లడి..

కోతుల సమస్యను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామ పంచాయతీ కార్యదర్శుల లాగిన్‌లో మూడు ప్రశ్నలతో కూడిన ఆన్‌లైన్‌ సర్వేను నిర్వహిస్తున్నారు. మీ గ్రామంలో కోతులు ఉన్నాయా.. వాటి వలన పంట నష్టం జరుగుతుందా.. రోజువారి కార్యక్రమాలకు ఆటంకం కలగడంతో పాటు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయా అనే ప్రశ్నలతో సర్వే జరుగుతుంది.జిల్లాలో 231 గ్రామాల్లో సర్వే కాగా అన్నింటిలో కోతుల సమస్య ఉన్నట్లుగా గ్రామస్తులు వెల్లడించారు.

1,971 కేసులు నమోదు

ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈనెల ఏడో తేదీ వరకు కోతుల దాడుల కేసులు 1,971 నమోదయ్యాయి. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో 213 కేసులు నమోదయ్యాయి. పీహెచ్‌సీల వారీగా కూడా భారీగానే కేసులు నమోదయ్యాయి. భూపాలపల్లి పీహెచ్‌సీ 366, చెల్పూరు 316, కాళేశ్వరం 222, మొగుళ్లపల్లి 129, వెలిశాల 167, ఒడితల 135, కాటారం 121, రేగొండ 73, ఆజంనగర్‌ 62, మహాముత్తారం 54, గణపురం 40, తాడిచర్ల 7, అంబట్‌పల్లి పీహెచ్‌సీలో ఒక కేసు నమోదైంది. చిట్యాల సీహెచ్‌సీలో 65 కేసులు నమోదయ్యాయి.

కోతుల దాడి నుంచి పంటలను కాపాడుకునేందుకు కొందరు రైతులు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కుక్కలను పెంచుకొని పంటలను చుట్టూ తిప్పడం, సోలార్‌ ఫెన్షింగ్‌ వేసుకొని పంటలను కాపాడుకుంటున్నారు. కాటారం డివిజన్‌లోని అటవీ గ్రామాల్లో పంటల చుట్టూ చీరలను కడుతున్నారు. అయినప్పటికీ కొంతమేరకు పంటనష్టం జరుగుతూనే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement