భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీలో నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు గురువారం ఓరియంటేషన్ సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ జుమ్లానాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు కోర్సులు, నైపుణ్య శిక్షణ, ఉద్యోగ, అప్రెంటిస్‌షిప్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐలను ఏటీసీలుగా ఆధునీకరించి అత్యాధునిక కోర్సులను అందుబాటులోకి తెచ్చిందన్నారు. తరగతి గది బోధనతో పాటు ప్రాక్టికల్ శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, క్రమశిక్షణ, సమయపాలన, తప్పనిసరి హాజరును పాటించాలని సూచించారు. కోర్సు పూర్తయిన తర్వాత పరిశ్రమల్లో ఉద్యోగాలు, అప్రెంటిస్‌షిప్, స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఐటీఐ పూర్తిచేసిన వారు పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో చేరే అవకాశం ఉందన్నారు. యువత దేశ భవిష్యత్ అని, చెడు సావాసాలు, క్షణికావేశంతో మత్తు పదార్థాలకు బానిస కావద్దని హెచ్చరించారు. డ్రగ్స్‌తో శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతాయని తెలిపారు. మాదకద్రవ్యాల సరఫరా, రవాణా, వినియోగం చట్టరీత్యా తీవ్రమైన నేరమని, భవిష్యత్‌లో ఉద్యోగాలు, పాస్‌పోర్టు, ఇతర అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ఐటీఐ అనంతరం జపనీస్, జర్మన్ భాషలను నేర్చుకుంటే టీఓఎంసీఓఎం ద్వారా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉజ్వల భవిష్యత్‌ను నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఆఫీసర్, ఐటీఐ, ఏటీసీ ఏటీఓలు, సిబ్బంది, నూతన విద్యార్థులు పాల్గొన్నారు.


