జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–6 వెల్లడి
భూపాలపల్లి అర్బన్: జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–6 (2023–24) ప్రకారం మాతా శిశు ఆరోగ్య పరిరక్షణలో జిల్లాకు కొన్ని సానుకూల ఫలితాలు నమోదవుతున్నా.. గర్భిణుల పోషకాహారంపై మాత్రం మరింత దృష్టి అవసరమని గణాంకాలు సూచిస్తున్నాయి. గర్భధారణ సమయంలో కనీసం 100రోజుల పాటు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకున్న తల్లులు 60.3శాతం మాత్రమే ఉన్నారు. 180 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం తీసుకున్న వారు 38.9 శాతానికే పరిమితమయ్యారు. అంటే గర్భధారణ కాలంలో నిర్దేశిత కాలం పాటు ఐరన్, ఫోలిక్ యాసిడ్ వినియోగం విషయంలో ఇంకా గణనీయమైన అంతరం ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
పల్లెల్లో చేరువ ఎంత?
జిల్లాలోని మారుమూల గ్రామాల్లో గర్భిణులు ఆరోగ్య సేవల కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన పరిస్థితులు ఉంటే.. పోషకాహారం, వైద్య పరీక్షలు, మందుల పంపిణీ వంటి సేవలను నిరంతరం అందించడం సవాలుగా మారే అవకాశం ఉంది. అందుకే గ్రామస్థాయిలో అంగన్‌వాడీ కేంద్రాలు, ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంల ద్వారా గర్భిణుల ఆరో గ్య పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించడం కీలకం. జిల్లా ఆరోగ్య కార్యాచరణ ప్రణాళికలో నెలవారీ విలేజ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ డేస్ నిర్వహణకు 5,040 కార్యక్రమాలను లక్ష్యంగా పెట్టడం, గర్భిణులకు కాల్షియం మాత్రలు, ఉచిత రిఫరల్ రవాణా వంటి మాతృ ఆరోగ్య సేవలకు నిధులు కేటాయించడం కూడా గ్రామస్థాయిలో సేవల చేరువకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చూపుతోంది.
పోషకాహార లోపం.. బిడ్డపైనా ప్రభావం
గర్భధారణ సమయంలో పోషకాహారం అందకపోవడంతో శిశువు ఎదుగుదలపైనా ప్రభావం చూపే అంశంగా వైద్యరంగం పరిగణిస్తోంది. జిల్లా గర్భిణుల్లో ఐరన్–ఫోలిక్ యాసిడ్ వినియోగం, చిన్నారులకు తగిన ఆహారం వంటి అంశాలను ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అవసరాన్ని సూచించింది. జిల్లాలో 5 సంవత్సరాల వయస్సు గల తక్కువ బరువు ఉన్న పిల్లలు 31.6 శాతం, ఎదుగుదల లోపం ఉన్న వారు 22.7శాతం ఉన్నారు.
వంద శాతం ప్రసవాలు..
మరి పోషకాహారం?
జిల్లాలో గత ఐదేళ్లలో 100 శాతం సంస్థాగత ప్రసవాలు నమోదవడం మాతా ఆరోగ్య సేవల్లో ముఖ్యమైన సూచిక. ప్రసవం ఆస్పత్రిలో జరగడం ఒక్కటే సరిపోదు. గర్భధారణ ప్రారంభం నుంచి ప్రసవం వరకు తల్లికి సమతుల్య ఆహారం, అవసరమైన సూక్ష్మ పోషకాలు, క్రమబద్ధమైన వైద్య పరీక్షలు అందేలా చూడాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి మారుమూల గ్రామాల్లో గర్భిణుల పోషకాహార పరిస్థితిపై గ్రామస్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ, అంగన్‌వాడీ, ఆశ, ఆరోగ్య సిబ్బంది సమన్వయం, అర్హత ఉన్న ప్రతీ మహిళకు పోషకాహార సేవలు చేరుతున్నాయా లేదా అనే అంశంపై నిరంతర తనిఖీలు అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గర్భిణుల పోషకాహారంపై నిర్లక్ష్యం
తగ్గుతున్న ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రల వినియోగం
తూతూమంత్రంగా అవగాహన
కార్యక్రమాలు
ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు
ఐదేళ్ల పిల్లల్లో లోపిస్తున్న ఎదుగుదల


