● పరిహారం ఇవ్వడం లేదని
రైతుల అసంతృప్తి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం వీఐపీ ఘాటు రోడ్డు కోసం సరస్వతీనది ఆది, అంత్య పుష్కరాల పనుల కోసం భూములు కోల్పోయిన రైతులకు పరిహారం, పంట నష్టం అందకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది. భూసేకరణ జరిగి ఏడాదిన్నర కావస్తున్నా నష్టపరిహారం, పంట నష్టం చెల్లింపులు పూర్తికాలేదని బాధిత రైతులు వాపోతున్నారు. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా స్పష్టమైన సమాధానం లభించడం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం గ్రామానికి చెందిన ముంగి బాపు అనే రైతు వీఐపీ ఘాట్ బీటీ రోడ్డుపై ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. దీంతో రోడ్డుపై రాకపోకలు నిలిచాయి. పరిహారం చెల్లించిన తర్వాతే భూములు అప్పగిస్తామని రైతులు వాపోతున్నారు. రాబోయే గోదావరి పుష్కరాల దృష్ట్యా ఘాట్లు, రహదారుల అభివృద్ధికి భూములు అవసరమవుతున్నందున అధికారులు రైతులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
కాళేశ్వరంలోని వీఐపీఘాట్‌కు రోడ్డు నిర్మాణం కోసం పది గుంటల భూమి రెవెన్యూ, ఎండోమెంట్, ఇరిగేషన్, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు తీసుకున్నారు. ఆది, అంత్య పుష్కరాలు ముగిసినా పరిహారం, పంట నష్టం ఇవ్వడం లేదు. ఎన్ని సార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు. కలెక్టర్ స్పందించి పరిహారంతో పాటు పంట నష్టం ఇప్పించాలి. గోదావరి పుష్కరాల కోసం సర్వేలు చేస్తున్నారు. రైతులు భూములు ఇచ్చే పరిస్థితిలో లేరు.
ముంగి బాపు, రైతు


