భూపాలపల్లి రూరల్: జిల్లాకేంద్రంలో ఈనెల 9న నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్‌ను శనివారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్, బీటెక్, ఎంటెక్, బీఫార్మసీతో పాటు వివిధ కోర్సులు పూర్తి చేసిన యువత ఈ జాబ్ మేళాకు హాజరై తమ విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను పొందాలని సూచించారు. సుమారు 300 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొననున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ పాల్గొన్నారు.
దీపావళి బోనస్ రూ.1,10,250
భూపాలపల్లి అర్బన్: బొగ్గు గని కార్మికులకు ఈ ఏడాది దీపావళి బోనస్ (పీఎల్‌ఆర్) రూ.1,10,250 చెల్లించేందుకు అపెక్స్ జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ (జేసీసీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం జరిగిన సమావేశానికి బీఎంఎస్ జాతీయ బొగ్గు పరిశ్రమల ఇన్‌చార్జ్ కొత్తకాపు లక్ష్మారెడ్డి, సుధీర్ గురిడే హాజరయ్యారని పేర్కొన్నారు. నాలుగు జాతీయ కార్మిక సంఘాలు ఏకగ్రీవంగా బోనస్ మొత్తాన్ని నిర్ణయించాయని తెలిపారు. కార్మికుల ఐక్యత, బీఎంఎస్ నిరంతర కృషి ఫలితంగానే రూ.1,10,250 పీఎల్‌ఆర్ సాధ్యమైందన్నారు.
సామాజిక తనిఖీ ప్రజావేదిక
మల్హర్(కాటారం): కాటారం మండల ప్రజా పరిషత్ ప్రాంగణంలో శనివారం 16వ విడత వీబీజీ రామ్‌జీ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో 305 పనులకు సంబంధించిన ఆడిట్ నివేదికను అడిట్ బృందం సభ్యులు వెల్లడించారు. మొత్తం రూ.3.79కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అందులో కూలీల వేతనాలు రూ.3.71కోట్లు, మెటీరియల్ వ్యయం రూ.8.16లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో గుర్తించిన లోపాలకు రూ.11,616 పెనాల్టీ విధించారు. ఈ సందర్భంగా డీఆర్‌డీఓ బాలకష్ణ మాట్లాడుతూ..సోమవారం నుంచి ప్రతీ గ్రామంలో కనీసం 100మందికి ఉపాధి హామీ పనులు కల్పించాలన్నారు. ప్రతీ 40మంది కూలీలకు ఒక మేట్‌ను నియమించాలని ఆదేశించారు. కార్యక్రమంలో శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, అదనపు డీఆర్‌డీఓ సురేందర్, క్యూసీ దారాంసింగ్, ఏపీడీ మంజులాదేవి, అంబుడ్స్‌మన్ శ్రీనివాస్, డీవీసీ రుబీనా బేగం, ఎంపీడీఓ అడ్డూరి బాబు, ఎస్‌ఆర్‌పీ నరేందర్, ఏపీఓ వెంకన్న, ఈసీ శ్రీకాంత్, సర్పంచ్‌లు, కార్యదర్శులు పాల్గొన్నారు.
15వరకు అవకాశం
భూపాలపల్లి అర్బన్: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027–28 విద్యా సంవత్సరానికి 9, 11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే లేటరల్ ఎంట్రీ సెలెక్షన్ టెస్ట్–2027 దరఖాస్తు గడువును ఈ నెల 15వరకు పొడిగించినట్లు మామునూర్ జవహర్ నవోదయ విద్యాలయం ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ టి.రమేశ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026–27లో 8వ తరగతి చదువుతున్న వారు 9వ తరగతికి, 10వ తరగతి చదువుతున్న వారు 11వ తరగతికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అర్హులని, ఎంపిక పరీక్ష 2027 ఏప్రిల్ 10న జరుగుతుందన్నారు.
‘నిబంధనల పేరుతో
ఇబ్బంది పెట్టొద్దు’
భూపాలపల్లి అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో స్లాబ్ విస్తీర్ణంపై విధించిన పరిమితితో నిరుపేద లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ అన్నారు. నిబంధనలను తక్షణమే సడలించాలని కోరుతూ జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీకాంత్‌కు శనివారం వినతిపత్రం అందజేశారు. 750 చదరపు అడుగులు దాటితే బిల్లులు నిలిపివేస్తామని అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో–కన్వీనర్ రామగిరి రాజు, పుల్యాల సురేశ్ పాల్గొన్నారు.


