భూపాలపల్లి అర్బన్: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా మెట్ట పంటలు సాగు చేసే రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) ప్రధాన కార్యదర్శి పస్య పద్మ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రావినారాయణరెడ్డి భవన్‌లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం 3వ మహాసభలు జిల్లా అధ్యక్షుడు గొంటు చంద్రమౌళి అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహాసభలకు పద్మ హాజరై మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలో డ్రిప్ సాగును విస్తరించడంతోపాటు బోర్లు, బావుల వద్ద సోలార్ విద్యుత్ వ్యవస్థలను సబ్సిడీపై ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించి, వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ భూసార పరీక్షలు నిర్వహించి పంటల ఎంపికపై రైతులకు సలహాలు ఇవ్వాలని కోరారు. తాగు, సాగు నీటి సమస్యలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ మహాసభలో తెలంగాణ రైతు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మామిడాల సమ్మిరెడ్డి, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పైళ్ల శాంతికుమార్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పరమండ్ల రాజయ్య, పెంట రవి, వెంకటేష్, నిమ్మల రాజయ్య, ఎండీ నబిలు పాల్గొన్నారు.
ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి పద్మ


