కొనండి మహాప్రభో.. | - | Sakshi
Sakshi News home page

కొనండి మహాప్రభో..

May 30 2026 2:50 AM | Updated on May 30 2026 2:50 AM

భూపాలపల్లి: కష్టనష్టాలను ఓర్చుకొని ఆరుగాలం పండించిన వరిధాన్యాన్ని విక్రయించేందుకు జిల్లావ్యాప్తంగా అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. హమాలీలు, లారీల కొరత కారణంగా పక్షం రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వడ్లను నేటికీ కాంటా వేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

అధికారుల ముందుచూపు లేమి

కారణంగానే..

జిల్లాలోని 12 మండలాల్లో వానాకాలం సీజన్‌లో వరి, మిర్చి, పత్తి పంటలను సాగు చేయగా అకాల వర్షాల మూలంగా మిర్చి, పత్తి పంటల నుంచి అంతగా దిగుబడి రాలేదు. దీంతో ఈ యాసంగిలో సుమారు 1.05 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. 1.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులు దిగుబడి చేసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి రోజుల తరబడి వేచిచూస్తున్నా కొనే నాఽథుడే కరువయ్యాడు. గతంలో తేమ పేరిట జాప్యం చేయగా ఇప్పుడు హమాలీలు, లారీల కొరతతో సకాలంలో ధాన్యం కొనుగోలు జరగడం లేదు. వడ్లను విక్రయించేందుకు ఒక్కో రైతు కనీసం 15 నుంచి 20 రోజుల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పౌరసరఫరాల అధికారుల ముందు చూపు లేమి కా రణంగానే ఈ పరిస్థితి ఎదురైనట్లుగా తెలుస్తోంది.

వర్షం వస్తే ధాన్యం నీటిపాలే..

జిల్లాలో రైతులు పండించిన వరిధాన్యం ఈ నెల 28వ తేదీ వరకు 99,138 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు కేంద్రాలకు రాగా 61,698 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసినట్లుగా అధికారులు తెలిపారు. అధికారుల లెక్కలకు మించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో గడిచిన రెండు రోజులు ఓ వైపు ఉష్ణోగ్రతలు పెరుగుతూనే మరోవైపు ఈదురుగాలులు వీస్తూ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వర్షం కురిస్తే కేంద్రాల్లో వడ్లు తడిసి ముద్దవుతాయని, కొనే నాఽథుడే కరువవుతాడని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి భయపడి రైతులు ధాన్యం బస్తాలపై కవర్లు కప్పుకొని వెళ్తుండగా మరికొందరు రైతులు రాత్రి 12 గంటల వరకు కొనుగోలు కేంద్రాల వద్దనే ఉంటున్నారు.

ప్రజాప్రతినిధులు చెప్పినా..

ధాన్యం కొనుగోలులో అలసత్వం ప్రదర్శించవద్దని ఓవైపు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌రాబు, మరోవైపు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులకు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం ప్రదర్శించే వారిని సస్పెండ్‌ చేస్తామని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కొనుగోళ్లలో వేగం పెరగడం లేదు.

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం

జిల్లాలో ఈదురుగాలులు,

వర్ష సూచనలు

ఆందోళనలో అన్నదాతలు

హమాలీ, లారీల కొరత పేరిట జాప్యం

Advertisement
 
Advertisement
Advertisement