కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: జిల్లాలో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. నిన్న(గురువారం) జిల్లా గరిష్ట ఉష్ణోగ్రత 46.2 డిగ్రీలు నమోదైందని తెలిపారు. వాతావరణ శాఖ ముందస్తు సూచనల ప్రకారం రాబోయే మూడు రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉందని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటకు వెళ్లడం తగ్గించాలన్నారు. ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవాలను తీసుకోవాలన్నారు. వృద్ధులు, పిల్లలు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
పాలిసెట్ ధ్రువపత్రాల పరిశీలన
భూపాలపల్లి అర్బన్: పాలిసెట్ అడ్మిషన్ల కోసం ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం ప్రారంభమైనట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ సమన్వయకర్త డాక్టర్ ఎ.రమణారావు తెలిపారు. జూన్ 1వ తేదీ వరకు ధ్రువపత్రాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. ప్రవేశాలు పొందే విద్యార్థులు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని సూచించారు. ఈ పరిశీలనకు అధికారులుగా శ్రీధర్, దేవేందర్, శ్రీనివాస్, రాజకుమార్ వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.
కారు బోల్తా.. ఆరుగురికి గాయాలు
మల్హర్(కాటారం): కాళేశ్వరం వెళ్లి వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తాపడి ఆరుగురికి గాయాలైన ఘటన కాటారం మండలం బస్వాపూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండకు చెందిన ఆరుగురు కారులో శుక్రవారం కాళేశ్వరంలో అంత్యపుష్కరాలకు వెళ్లారు. పుష్కర స్నానాలు చేసి దర్శనం అనంతరం హనుమకొండకు తిరుగుపయనమయ్యారు. కాటారం మండలం బస్వాపూర్ క్రాస్ వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఓటరు జాబితా సవరణ
వేగవంతం
భూపాలపల్లి రూరల్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛమైన ఓటరు జాబితాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాది అని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలోని ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్ రాహుల్‌శర్మ, భూపాలపల్లి ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్లు, ఆర్‌ఐలు, బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు అబ్బాస్, నవీన్ పాల్గొన్నారు.
గాలివానతో కూలిన టెంట్లు
పలిమెల(కాళేశ్వరం): మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో శుక్రవారం ఉదయం గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో భక్తులకోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు, ఫ్లెక్సీలు నేలకూలాయి.


