ఏటూరునాగారం: బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని ఏపీఓ కొమురం నాగోరావు తెలిపారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో ఎస్‌ఎస్‌తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం(కె) మండలాలకు చెందిన పురోహితులు, ఖ్వాజీలు, పాస్టర్లు, టెంట్‌హౌజ్ నిర్వహకులు, ఫొటో గ్రాఫర్లు, ప్లెక్సీలు ముద్రించేవారు, బ్యాండ్‌మేళం, క్యాటరింగ్ నిర్వహకులతో బాల్య వివాహాలపై అవగాహన సదస్సును శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఓ మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికడితేనే బాలల భవిష్యత్‌కు భరోసా లభిస్తుందన్నారు. ఏజెన్సీలో వందశాతం బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ కట్టుబడి ఉండాలన్నారు. తద్వారా అందరూ కలిసికట్టుగా ములుగును బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఐటీడీఏ అదనపు ప్రాజెక్టు అధికారి కొమురం నాగోరావు అన్నారు. అనంతరం డీడబ్ల్యూఓ ఈసంపెల్లి ప్రేమలత మాట్లాడుతూ బాల్య వివాహాల సమాచారం ముందుగా తెలిసే అవకాశం పురోహితులు, ఖ్వాజీలు, పాస్టర్లు, టెంట్‌హౌజ్ నిర్వహకులకు తెలిసి ఉంటుందని తెలిపారు. ఈ సమయంలోనే వారిని కట్టడి చేసి వయస్సు నిండని అమ్మాయిలకు వివాహం చేస్తే జరిగే నష్టాలపై వివరించాలని సూచించారు. వివాహాలతో సామాజిక, ఆరోగ్య, కుటుంబ పరమైన దుష్ప్రభావాలను తల్లిదండ్రులకు వివరించాల్సి ఉంటుందన్నారు. వధువు వయస్సు 18 ఏళ్లు, వరుడి వయస్సు 21 ఏళ్లు నిండాలని అలా కాకుండా తక్కువ వయస్సు ఉన్నవారికి వివాహం చేస్తే పోక్సో కేసు నమోదు అవుతుందని హెచ్చరించారు. అలాగే రెండేళ్ల జైలుతో పాటు రూ.1 లక్ష జరిమానా విధిస్తారని వివరించారు. ములుగును బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చేందుకు కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వాల్ పోస్టర్లను ఆవిష్కరించి హాజరైన వారికి అందజేశారు. ఈ కార్మక్రమంలో వెంకటాపురం సీడీపీఓ ముత్తమ్మ, జిల్లా బాలల పరిరక్షణ అధికారులు ఓంకార్, హరికృష్ణ, సర్పంచ్‌లు, వీసీపీసీ కన్వీనర్లు, టీచర్లు, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు కృష్ణవేణి, హరికృష్ణ, సంజీవ, సుమన్, జ్యోతి, రాజు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ ఏపీఓ కొమురం నాగోరావు


