భూపాలపల్లి: అకాల వర్షాల దృష్ట్యా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మక్కల కొనుగోలులో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. అదే స్ఫూర్తితో ధాన్యం కొనుగోళ్లలో సైతం వేగం పెంచాలని సూచించారు. అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ధాన్యం కాంటా జరిపిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ కచ్చితంగా చేయాలన్నారు. ఐరిస్ పద్ధతిని తొలగించి ఓటీపీ ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టాలన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. ట్రక్ షీట్ ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీ రోజు కచ్చితంగా 8 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు


