సాక్షి, పెద్దపల్లి : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చివరి గింజ వరకూ మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై పెద్దపల్లి ఐడీఓసీ కార్యాలయంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావుతో కలిసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు గత ప్రభుత్వంతో పోలిస్తే 25 నుంచి 30 శాతం అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, 8 లక్షల మంది రైతులకు రూ.11 వేల కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు ఇసుక రవాణా నిలిపివేసి వాహనాలను పూర్తిగా ధాన్యం రవాణాకు వినియోగించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం సుమారు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండగా, ఎఫ్‌సీఐ కేవలం 51 లక్షల మెట్రిక్ టన్నులకే పరిమితమైందన్నారు.డిసెంబర్ 2023 తర్వాత కనీస మద్దతు ధర విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తూ రైతులకు ఇప్పటివరకు అదనంగా రూ.16,479 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వర్షాల కారణంగా కేవలం 9 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిందని, ఆ ధాన్యాన్ని కూడా పూర్తి మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.
తరుగుతీస్తే కఠిన చర్యలు..
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని తెలిపారు. అవసరమైతే అదనపు గోదాములు అద్దెకు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఎక్కడైనా రైతుల నుంచి ఒక్క కేజీ ధాన్యం తరుగు తీసినట్లు తెలిసినా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా మిల్లర్లతో రైతులకు పరిహారం ఇప్పిస్తామని హెచ్చరించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ జిల్లాలో స్టోరేజీ ప్లేస్ తక్కువగా ఉన్నందున, పెద్దపల్లిలో 50వేల మెట్రిక్‌టన్నుల ధాన్యం దించుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రులను కోరారు.
65 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం..
కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ యాసంగి సీజన్‌లో లక్షా 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 185 కొనుగోలు కేంద్రాల ద్వారా 65 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. జిల్లాకు సంబంధించి పెద్దపల్లిలో 20 వేల మెట్రిక్ టన్నులు, వరంగల్‌లో 20 వేల మెట్రిక్ టన్నులు, హనుమకొండలో 10 వేల మెట్రిక్ టన్నులు మిల్లింగ్ కోసం పౌరసరఫరాల శాఖ అలాట్మెంట్ చేసిందని తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో హర్వెస్టింగ్ కొన్ని ప్రాంతాలలో ఆలస్యంగా జరుగుతుందని, చాలా మండలాలో ఇంకా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రావాల్సి ఉందని అన్నారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.


