మల్హర్: వల్లెకుంట గ్రామ సమైక్య భవన నిర్మాణానికి గురువారం రాష్ట్ర ట్రెడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి భూమి పూజ చేశారు. రూ.10లక్షలతో నిర్మించే భవనాన్ని త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొమ్మ రజిత, ఉపాధిహామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితెల రాజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి పాల్గొన్నారు.
కుమారుడి ఫొటోకు
పుష్కర స్నానం
భూపాలపల్లి అర్బన్: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బేతాళగడ్డ గ్రామానికి చెందిన గంగిశెట్టి పద్మావతి, తన కుమార్తె ఝాన్సీతో కలిసి సరస్వతి ఘాట్‌కు విచ్చేసి పుష్కర స్నానం చేశారు. ఈ సందర్భంగా రెండు సంవత్సరాల క్రితం విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన తన కుమారుడు గంగిశెట్టి మహేష్ ఫొటోకు పవిత్ర స్నానం ఆచరించారు. కుమారుడి జ్ఞాపకాలను తలుచుకుంటూ భావోద్వేగానికి గురైన ఆమెను చూసిన భక్తులు సైతం చలించిపోయారు.
రామప్ప దేవాలయంలో సీవీఓ శశిధర్ రాజు పూజలు
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని గురువారం తెలంగాణ సివిల్ సప్లయీస్ డిపార్ట్‌మెంట్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సీవీఓ) శశిధర్ రాజు కుటుంబ సమేతంగా సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు హరీశ్ శర్మ, ఉమా శంకర్‌లు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేశ్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం(ఎం)ఎస్సై చల్లా రాజు, టూరిస్ట్ పోలీసులు శ్రీకాంత్, భద్రు ఉన్నారు.
బాల్యవివాహాల
నిర్మూలనకు కృషి
ఏటూరునాగారం: జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని డీడబ్ల్యూఓ ప్రేమలత సూచించారు. ఈ మేరకు మండల కేంద్రంలో ఆమె గురువారం విలేకరులతో మాట్లాడారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ములుగును బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని మండలాల్లో అవగాహన సదస్సులను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు నేడు(శుక్రవారం) ఐటీడీఏలో అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ఎస్‌ఎస్‌తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వెంకటాపురం(కె), వాజేడు మండలాలకు చెందిన వివాహాలు నిర్వహించే పురోహితులు, ఖ్వాజీలు, పాస్టర్లు, టెంట్‌హౌజ్ నిర్వాహకులు, ఫొటోగ్రాఫర్లు, బ్యాండ్ మేళం నిర్వాహకులకు బాల్య వివాహ నిరోధక చట్టంపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
భక్తిశ్రద్ధలతో బక్రీద్
చిట్యాల: బక్రీద్ వేడుకలను ముస్లింలు జిల్లావ్యాప్తంగా గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొరు అలాయి బలాయి తీసుకున్నారు. భూపాలపల్లి, గణపురం మండలాల్లో ప్రార్థనల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు.


