భూపాలపల్లి: రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆగమాగం ఉందని.. రైతుల సమస్య గాలికి వదిలేసి ప్రభుత్వం గాలిలో సంచిరిస్తుందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. గురువారం జిల్లాకేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెంకటరమణారెడ్డి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం ఎగుమతి కాక, ఎగుమతి అయిన ధాన్యం దిగుమతి కాక రైతులు అరిగోస పడుతుంటే ముఖ్యమంత్రి గాలిలో తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపే అధ్వాన పరిస్థితి ఏర్పడిందన్నారు. రానున్న రెండు మూడు రోజులో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు. బీజేపీ రైతు గోస–బీజేపీ భరోసా యాత్ర రైతుల గోస చూడటానికి వచ్చినట్టు లేదని, బీజేపీ ప్రచారానికి వచ్చినట్టు హంగు ఆర్బాటాలు చేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మున్సిపల్ ప్లోర్ లీడర్ గండ్ర హరీశ్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జన్దాన్, కౌన్సిలర్లు, నాయకులు మోతె రాజు, నూనె రాజు, సతీష్ పాల్గొన్నారు.
బీజేపీది ప్రచార యాత్ర
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి


