యూరియాకు
ఆన్‌లైన్ నమోదు తప్పనిసరి
భూపాలపల్లి రూరల్: సాధారణ యూరియాకు బదులు నానోయూరియాను వాడాలని వ్యవసాయ అధికారులు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. దీనికి తోడు యూరియా కావాల్సిన రైతులు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవాల్సిందేనని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాకు 37 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు యూరియాను కేటాయించాలని ఆ శాఖ జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ ఖరీఫ్ సాగు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిన వ్యవసాయశాఖ అందులో ఎరువులకు సంబంధించిన నివేదికను కూడా ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ఖరీ్‌ఫ్‌లో 2,16,734 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని, మరో 20వేల ఎకరాలు ఉద్యాన పంటలు ఉంటాయని పేర్కొంది. ఈ సాగు విస్తీర్ణానికి సరిపడా యూరియాను కూడా అంచనా వేసింది. అయితే ఖరీఫ్ సీజనులో నెలవారీ కోటాలను కూడా ఖరారు చేశారు. జిల్లాలో ప్రస్తుతం 5,479 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలున్నాయి.
నెల వారీగా ఎంత మొత్తంలో యూరియా అవసరం ఉంటుందనే అంశాన్ని నివేదికలో పేర్కొన్నారు. అత్యధికంగా జూలైలో వినియోగం ఎక్కువగా ఉంటుంది. వరి సాగు చేసే రైతులు ఈ సమయంలో యూరియాను ఎక్కువగా వాడుతారు. జూన్‌లో 4,200 మెట్రిక్ టన్నులు, జూలైలో 5,101 మెట్రిక్ టన్నులు, ఆగస్టులో 5,225 మెట్రిక్ టన్నులు, సెప్టెంబర్ 6,135 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని లెక్కగట్టారు.
రైతులు యూరియా కొనుగోలు చేయాలంటే మొబైల్ యాప్‌లో ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవడం తప్పనిసరిగా మారింది. సాగుచేఉసిన పంట విస్తీర్ణం, ఆ విస్తీర్ణానికి సరిపడా నిర్ణీత మొత్తంలో మాత్రమే యూరియా కొనుగోలు చేసేందుకు వీలవుతుంది. సబ్సిడీ యూరియా పక్కదారి పట్టకుండా ప్రభుత్వం ఈ యాప్ విధానాన్ని అమలు చేస్తున్న విషయం విదితమే. అయితే కొందరు రైతుల పేరుతో యూరియా యాప్‌లో బుక్ చేసుకుని బ్లాక్ మార్కెట్ తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు గతంలో వ్యవసాయశాఖ అధికారుల దృష్టికి వచ్చింది. ఈసారి అలా జరగకుండా క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాల్సి అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పంటల సాగుకు సరిపడా యూరియా సరఫరా కాక గత వానాకాలం, యాసంగి లో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా వ్యవసాయశాఖ ముందు జాగ్రత్తలు చేపట్టింది. మరోవైపు యూరియా ఎరువుకు ప్రత్యామ్నాయంగా నానో యూరియాకు ప్రాధాన్యతనివ్వాలని వ్యవసాయశాఖ పేర్కొంటోంది. నానో యూరియా వాడకంతో వృథాను అరి కట్టవచ్చని రైతులకు వ్యవసాయ శాఖ వివరిస్తోంది. ఈ ఖరీఫ్ నానో యూరియాను వినియోగించుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.
ఖరీఫ్‌కు కావాల్సింది 37 వేల
మెట్రిక్ టన్నులు
ప్రభుత్వానికి ప్రతిపాదించిన
వ్యవసాయశాఖ
ప్రస్తుతం జిల్లాలో 5,479
మెట్రిక్ టన్నుల నిల్వలు
సెప్టెంబర్‌లో అత్యధిక డిమాండ్
నానో యూరియాపై నజర్


