యూనిఫామ్‌ ఊసేది? | - | Sakshi
Sakshi News home page

యూనిఫామ్‌ ఊసేది?

May 28 2026 12:34 AM | Updated on May 28 2026 12:34 AM

విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం (2026–27)లో యూనిఫామ్‌ సకాలంలో అందే పరిస్థితులు కనిపించట్లేదు. ఇప్పటివరకు క్లాత్‌ పంపిణీ కాకపోవడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. ప్రతీ ఏడాది ఏప్రిల్‌లో పాఠశాలలకు వేసవి సెలవులకు ముందే విద్యార్థులకు స్కూల్‌ వైజ్‌గా కొలతలు తీసుకునేవారు. టెస్కో నుంచి ఒక్కో విద్యార్థికి ఒక జత కోసం ఎంఆర్‌సీ పాయింట్లకు డీఆర్డీఏ అధికారుల పర్యవేక్షణలో క్లాత్‌ పంపిణీ చేసేవారు. విద్యార్థుల సంఖ్యను బట్టి క్లాత్‌ బండిల్స్‌ రాగానే ఆయా పాఠశాలల హెచ్‌ఎంల సమక్షంలో కుట్టు పనికి గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ పర్యవేక్షణలోని మహిళా సంఘాలకు, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ద్వారా క్లాత్‌ను అందజేసేవారు. ఒక్కో విద్యార్థికి తొలుత జత చొప్పున జూన్‌ 12వ తేదీ(పాఠశాలల పునఃప్రారంభం)కంటే ముందుగానే పాఠశాలల పాయింట్లలో అందుబాటులో ఉండేవి. మరో జత స్కూల్‌ యూనిఫామ్‌కు క్లాత్‌ చేరుకున్నాక ఆగస్టు నెల వరకు అందజేసేవారు. ఇలా ప్రతీ విద్యార్థికి రెండు జతల యూనిఫామ్‌ను అందజేస్తూ వస్తున్నారు. కానీ, ఈవిద్యాసంవత్సరం ఆరంభానికి రోజులు దగ్గర పడుతున్నప్పటికీ యూనిఫామ్‌ ఊసే వినిపించడం లేదు. హనుమకొండ, వరంగల్‌, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో ఏ జిల్లాకు కూడా ఇప్పటివరకు కనీసం ఒక జతకు సంబంధించి క్లాత్‌ కూడా చేరుకోలేదు.

ఈసారి టెస్కోకు ఇచ్చారా? లేదా?

రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా టెస్కో ద్వారానే స్కూల్‌ యూనిఫామ్‌ క్లాత్‌ను సరఫరా చేస్తున్నారు. ఈసారి టెస్కోకు కాకుండా ప్రభుత్వం ఓ ప్రైవేట్‌ సంస్థకు అప్పగిస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం ఆరోపణలు వచ్చాయి. టెస్కో ద్వారానే, మరేదైనా సంస్థ ద్వారా క్లాత్‌ పంపిణీ చేయిస్తారా? అనేది జిల్లాల విద్యాశాఖ అధికారులకు సమాచారం లేదు. ఇక మండల విద్యాశాఖ అధికారులు కూడా ఇప్పటివరకు క్లాత్‌ సరఫరా కాలేదని చెబుతున్నారు. ఎప్పుడు వస్తుందో తెలియదని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి పాఠశాలలు పునఃప్రారంభానికి జత స్కూల్‌ యూనిఫామ్‌ అందించడం సాధ్యం కాకపోవచ్చని పలువురు హెచ్‌ఎంల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ మండల పాయింట్లకు చేరుకుంటున్నాయి. హనుమకొండ జిల్లాలో 30,996 మంది, వరంగల్‌ జిల్లాలో సుమారు 32 వేల మంది, ములుగు జిల్లాలో 28,858 మంది విద్యార్థులకు యూడైస్‌ ప్రకారం రెండు జతల చొప్పున స్కూల్‌ యూనిఫామ్‌ అందించాల్సి ఉంటుంది.

24 వస్తువుల కిట్‌ ఎవరికి?

మరోవైపు ప్రభుత్వం విద్యార్థులకు 24 రకాల వస్తువులతో కూడిన కిట్‌ను ఈ విద్యాసంవత్సరం అందజేస్తుందన్న ప్రచారం ఉంది. ఆ కిట్‌లను అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలలకు అందజేస్తారా? లేదా? అనేది కూడా స్పష్టత లేదని చెబుతున్నారు. కిట్‌లు కేవలం గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకే పంపిణీ చేస్తారనేది విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల హనుమకొండ జిల్లాలో పలుచోట్ల ఉపాధ్యాయులు బడిబాటలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరేవారికి కిట్లను ప్రభుత్వం అందిస్తారని చెబుతూ వచ్చారు. ఆ తర్వాత గురుకుల విద్యార్థులకే అని తెలిసి చెప్పడం మానేశారని ఉపాధ్యాయ వర్గాల ద్వారా తెలిసింది.

ఇప్పటివరకు జిల్లాలకు రాని క్లాత్‌

పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఒక జత అయినా అందేనా?

ఎలాంటి సమాచారం లేదంటున్న విద్యాశాఖ అధికారులు

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య

జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 69

ప్రాథమికోన్నత పాఠశాలలు 44

ప్రాథమిక పాఠశాలలు 319

విద్యార్థుల సంఖ్య 24వేలు

Advertisement
 
Advertisement
Advertisement